GHMC action against stray dogs : హైదరాబాద్‌లో వీధి కుక్కల బెడద అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ కార్యాచరణ చేపట్టేందుకు సిద్దమవుతోంది. సమస్య పరిష్కారానికి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, జంతు ప్రేమికులు ముందుకు రావాలని మహానగర పాలక సంస్థ కోరుతోంది. ప్రధానంగా శానిటేషన్ వర్కర్స్ నుంచి ఏఎంఓహెచ్, డీసీలు కార్పొరేటర్లు కూడా సమస్య పరిష్కారంలో బాధ్యత తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు.
కుక్కలను పట్టుకోడాని వాహనాలు పెంపు: వీధి కుక్కల నియంత్రణకు ఎనిమల్ బర్త్ కంట్రోల్, స్టెరిలైజేషన్, వాక్సినేషన్ వేయడానికి ఇప్పటికే నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. దీంతో పాటుగా కుక్కలను పట్టుకోవడానికి ప్రస్తుతం ఉన్న 30 వాహనాలతో పాటు అదనంగా మరో 20 వాహనాలను ఏర్పాటు చేసి ఒక్కో వాహనానికి ఐదుగురు సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమించి కుక్కల బెడద నివారణకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నిర్లక్ష్యంగా ఉంటే కఠన చర్యలు తప్పవు: ప్రతి రోజు 150 కుక్కలకు జరుగుతున్న స్టెరిలైజేషన్ ప్రక్రియను ఇక నుంచి నూతన పరిజ్జానంతో 400 నుంచి 450 కుక్కలకు స్టెరిలైజేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యర్ధాలను కూడా వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేదిలేదని మేయర్ హెచ్చరించారు. కార్పొరేటర్‌కు తెలియకుండా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించవద్దని, ఒకవేళ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.