తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస  పకడ్బందీ వ్యూహం... గులాబీదే గ్రేటర్ పీఠం! - హైదరాబాద్​ వార్తలు

జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార తెరాస వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. సాధారణ మెజార్టీతో తమ పార్టీ కార్పొరేటర్‌ను మేయర్‌ను చేయడానికి ఆ పార్టీ అగ్రనేతలు రంగం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 11న.. ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం పూర్తికాగానే మేయర్‌, ఉప మేయర్‌ ఎన్నికను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

GHMC mayor position likely to come to TRS
జీహెచ్​ఎంసీ మేయిర్​ పదవి తెరాసకు దక్కే అవకాశం!

By

Published : Jan 23, 2021, 10:11 AM IST

Updated : Jan 23, 2021, 12:00 PM IST

డిసెంబరు 1న జీహెచ్​ఎంసీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఇందులో ఏ పార్టీకీ మేయర్‌ను ఎన్నుకునే స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. ప్రస్తుత పాలకవర్గం గడువు ఫిబ్రవరి 10తో పూర్తి కానుంది. ఆ మర్నాడే కొత్త పాలకవర్గ ఏర్పాటుకు ఎన్నికల సంఘం ముహూర్తం నిర్ణయించింది. పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవడంతో కో-ఆప్షన్‌ సభ్యుల ఆధారంగా మేయర్‌ పీఠం తెరాస దక్కించుకుంటుందని అంతా భావించారు. కాని సాధారణ మెజార్టీతో దక్కించుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. వచ్చే నెల 11న తమ కార్పొరేటరే మేయర్‌ పీఠంపై కూర్చుంటారని నగరానికి చెందిన అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఆ రోజు సగం మంది సభ్యులు హాజరైనా కోరం సరిపోతుందని చెబుతున్నారు. ఎన్నికైన కార్పొరేటర్లందరూ ప్రమాణం చేయాల్సి ఉన్నందున అన్ని పార్టీల కార్పొరేటర్లు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సాధారణ మెజార్టీ అంటే...

బల్దియా ఎన్నికల్లో తెరాస 56 స్థానాలు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎంఐఎం, భాజపా చేతులు కలిపి తమ కార్పొరేటర్‌ అభ్యర్థిని నిలిపితే తెరాస అభ్యర్థి గెలవడం కష్టమవుతుంది. ఈ కలయిక సాధ్యపడే అవకాశం లేదు. ఒక వేళ రెండు పార్టీలు వేర్వేరుగా అభ్యర్థిని నిలిపినా సాధారణ మెజార్టీతో తెరాస అభ్యర్థి సులభంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మెజార్టీ లేకపోవడంతో భాజపా మేయర్‌ బరిలో నిలిచే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంఎంఐ బరిలోకి దింపుతుందా.. లేక తమ కార్పొరేటర్లను ఓటు హక్కు వినియోగించుకోవద్దని చెబుతుందా.. లేక ప్రమాణం స్వీకారం పూర్తయిన తరువాత మేయర్‌ ఎన్నిక సమయంలో సభను వీడి వెళ్లిపోమంటుందా అన్న విషయం తేలాల్సి ఉంది.

ఇప్పటికే ఒక నిర్ణయానికి..

ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే మేయర్‌ అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికపై పార్టీ అధిష్ఠానం ఇంకా చర్చించలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ‘ఈటీవీ భారత్​’కు తెలిపారు. తమ కుమార్తె విజయలక్ష్మికి అవకాశం ఇవ్వాలని ఎంపీ కె.కేశవరావు కోరుతుండగా, తన భార్య శ్రీదేవికి ఇవ్వాలని మేయర్‌ రామ్మోహన్‌ కోరినట్లు తెలిసింది. మరికొందరూ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆరేడు పేర్లు చర్చలో ఉన్నాయి. ఈసారి ఉప మేయర్లుగా ఇద్దరికి అవకాశం కల్పిస్తారన్న విషయమై చర్చ నడుస్తోంది. ఇందుకు ఆర్డినెన్సు విడుదల చేస్తారని అంటున్నారు.

ఇదీ చదవండి:సినీ ఫక్కిలో కర్నాటకకు చెందిన స్వామిజీ కిడ్నాప్​..

Last Updated : Jan 23, 2021, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details