తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసి బతుకమ్మ పండుగ(Ghmc Mayor On Bathukamma)ను మహిళలు ఏటా ఘనంగా జరుపుకుంటున్నారని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, ఉద్యోగినులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆడారు.
అశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో ఎంగిలి కాని, వాడని పూలతో పేర్చిన బతుకమ్మ దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుందని మేయర్ తెలిపారు. ప్రకృతిలో లభించే ప్రతీ పువ్వును ఏరికోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని గృహాలు, వీధులు, ఆలయాల్లో నిల్పి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ.. ఆటలు ఆడడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.
రేపు పీపుల్స్ ప్లాజాలో...
పండగల్లో కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ (Ghmc Mayor On Bathukamma) ఇక్కడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటిందన్నారు. బతుకమ్మ పండుగను మహిళలు, చిన్న పెద్ద తేడాలేకుండా జరుపుకుంటున్నారని అన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో పూలతో బతుకమ్మను పూజించి... నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. బతుకమ్మలకు జీహెచ్ఎంసీ తరఫున లైట్స్, బేబి పాండ్స్ ప్రజల కోసం విస్తృతంగా ఏర్పాటు చేశామని తెలిపారు. సద్దుల బతుకమ్మకు జీహెచ్ఎంసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రేపు పీపుల్ ప్లాజాలో గవర్నర్ తమిళిసై సౌందరాజన్, ఎమ్మెల్సీ కవిత, శాసన సభ్యులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.