హైదరాబాద్ మహానగర పరిధిలో అమలవుతున్న అభివృద్ది, స్వచ్ఛ కార్యక్రమాలపై జోనల్ వారిగా సమీక్షా సమావేశాలకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ సుందరీకరణకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. బిన్‌లెస్ సిటీగా మార్చే క్రమంలో వీధుల్లో పేరుకుపోయే చెత్తను వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణతో పాటు వాటిలో పరికరాలు దొంగిలించేవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని మేయర్ ఆదేశించారు.
స్వచ్ఛ హైదరాబాద్‌కు అత్యంత ప్రాధాన్యత: మేయర్ - హైదరాబాద్ మేయర్ సమీక్ష
స్వచ్ఛ హైదరాబాద్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు మరిన్ని ఉద్యానాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
60 ఏళ్లు పైబడిన పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వారి స్థానంలో వారు సూచించిన కుటుంబ సభ్యులకు నియమకాలు జరపాలని తెలిపారు. కరోనా తిరిగి ఉద్ధృతమవుతున్న దృష్ట్యా ఫాగింగ్, స్ప్రేయింగ్, శానిటైజేషన్‌లను రోజూ నిర్వహించాలని ఆదేశించారు. నాలాల పూడిక పనులను త్వరితగతిన పూర్తిచేయాలని నిర్దేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో నగర పౌరులను భాగస్వామ్యం చేసే చర్యలను పునరుద్ధరించాలని సూచించారు. సమావేశంలో జోనల్ కమిషనర్ ప్రావిణ్య, సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లు, వైద్యాధికారులు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:గిరిజన ప్రజలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్