వర్షాకాలం మొదలైంది. బల్దియా అప్రమత్తమైంది. హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయం కావడం వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావటం ప్రతి ఏటా సాధారణంగా మారింది. ఈ ఏడాది ఆ పరిస్థితి ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. వర్షపునీరు సులభంగా ప్రవహించేందుకు అనువుగా నాలాల్లో ఉన్న పూడికను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక వార్షిక ప్రణాళికను అమలుచేస్తోంది. వర్షాకాలం ముందు, వర్షాకాలం తర్వాత చేపట్టాల్సిన పనులపై లక్ష్యాలను నిర్దేశించుకుంది. లోతట్టు ప్రాంతాలు, రోడ్ల పక్కన, రోడ్లపైన వర్షపునీరు నిలిచిపోకుండా, డ్రెయిన్లు, నాలాల ద్వారా సులభంగా నీరు వెళ్లిపోయేందుకు అనువుగా పనులను చేపట్టింది. అందులో భాగంగా ఈ ఏడాది 43.38 కోట్ల వ్యయంతో 4.79 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించాలని నిర్ణయించింది. అందులో ఇప్పటి వరకు 702 కిలోమీటర్లలో 3.75 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు. మరో వారం రోజుల్లో వర్షాకాలం ముందు నిర్దేశించిన మేరకు పూడికను తొలగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
వర్షపు నీటిని తొలగించేందుకు బృందాలు
వర్షాకాలంలో ఎదురయ్యే పరిస్థితులను అధిగమించుటకు ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లపై నిలిచిన వర్షపునీటిని తక్షణమే స్పందించి తొలగించుటకు సమస్యాత్మక ప్రదేశాల్లో 89 స్టాటిక్ బృందాలను, 118 మినీ మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు, 79 మొబైల్ ఎమర్జెన్సీ బృందాలను బల్దియా నియమించింది. ఈ బృందాలు 24గంటల పాటు ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉంటారు. అలాగే క్షేత్రస్థాయి అధికారులు, బృందాలతో సమన్వయం చేసేందుకు ఒక జోనల్ ఎమర్జెన్సీ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. నిలిచిన వర్షపు నీటిని నాలాలు, డ్రెయిన్లలోకి పంపేందుకు 202 మోటర్ పంపులను అందుబాటులో ఉంచారు.