హైదరాబాద్‌ను యాచక రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాలు, కూడళ్లల్లో యాచక వృత్తిపై జీవిస్తున్న వారిని గుర్తించి కేటగిరిల వారీగా వర్గీకరించి సమగ్ర పునరావాసానికై ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు తగినట్లుగా వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు, మానసిక వైకల్యం ఉన్నవారు, మహిళలు, పురుషులు, ట్రాన్స్ జెండర్స్‌కు విడివిడిగా పునరావాసం కల్పించుటకై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
ప్రతి జోన్‌లో రెండెకరాల చొప్పున స్థలం:
జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, మెప్మా, రెవెన్యూ, కార్మిక, ట్రాఫిక్, సాంఘీక సంక్షేమ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షత వహించారు. యాచక వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పించుట కోసం నగర పరిసరాల్లో ప్రతి జోన్‌లో రెండెకరాల చొప్పున స్థలం గుర్తించాలని అధికారులకు స్పష్టం చేశారు. పిల్లలకు విద్యను అందించుటకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. యువతకు పునరావాసం కల్పించిన కేంద్రంలోనే నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని నెలకోల్పాలని తెలిపారు. మహిళలకు టైలరింగ్, అల్లికలు, బ్యూటీషియన్ లాంటి కోర్సులలో శిక్షణ ఇవ్వాలని కోరారు.