వర్షాకాలంలో నగరవాసులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు బల్దియా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధానంగా గ్రేటర్లో మ్యాన్‌హోల్ మరమ్మతులపై జీహెచ్ఎంసీ దృష్టిసారించింది. ఈ మ్యాన్‌హోల్స్ నగరంలో పలుచోట్ల రహదారి కంటే ఎత్తుగా, మరికొన్ని చోట్ల లోతుగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పైకప్పులు లేని మ్యాన్‌హోల్స్‌లో వాహనదారులు పడి మరణించిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలను నియంత్రించేందుకు వర్షాకాలం కంటే ముందే మరమ్మతులు చేయాలని బల్దియా భావిస్తోంది.
జీహెచ్ఎంసీ, జలమండలి, హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు సంయుక్తంగా ప్రమాదకర మ్యాన్‌హోల్స్‌పై దృష్టిసారించారు. నగరంలో సుమారు 17 వేల క్యాచ్పిట్లు, మ్యాన్‌హోల్స్, జలమండలికి చెందిన స్లూయిస్ వాల్వ్ ఛాంబర్లు ఉన్నాయి. వాటన్నింటిని రహదారులకు సమాంతరంగా చేసే పనులు వేగవంతమయ్యాయి.