ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ దూకుడు పెంచింది. పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయిన యాజమాన్యాల నుంచి ఆస్తిపన్ను వసూలు చేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది ఇప్పటికే రంగంలోకి దిగింది. ఇప్పటికే ఎర్లీ బర్డ్ పథకంతో కొంతవరకు ఆస్తిపన్నులు వసూలు చేసినా.. ప్రభుత్వం ప్రకటించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన ఆదాయ వనరు ఆస్తి పన్ను. బల్దియాకు వచ్చే పన్నుల్లో నిర్మాణ అనుమతి పన్ను, ప్రకటనల పన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్నులు ఉన్నపటికీ ఆస్తి పన్ను రాబడి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆర్థిక ఏడాదిలో 1800 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూళ్లను జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం సాధించేందుకు అవకాశం ఉన్న అన్ని కార్యక్రమాలను బల్దియా అమలు చేస్తుంది. ఈ ఆర్థిక ఏడాది ఆరంబంలో ఎర్లీబర్డ్ పథకం ద్వారా ఆస్తి పన్ను చెల్లిస్తే పన్నులో 5 శాతం తగ్గించే పథకం తీసుకొచ్చారు. ఎర్లీ బర్డ్ పథకం కింద ఏప్రిల్, మే నెలల్లో మొత్తం 570 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఆ తర్వాత కరోనా తీవ్రత పెరగడం వల్ల జూన్, జులై నెలల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందగించాయి.
పన్ను వసూళ్ల కోసం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాటిని రాబట్టేందుకు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో, నగర పాలక సంస్థల్లో పాత ఆస్తి పన్నుపై ఉన్న వడ్డీ బకాయిపై 90 శాతం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులు చాలామంది చెల్లింపుదారులకు ఉపశమనం కలుగనుంది. దీంతో ఏళ్లుగా పెండింగ్ ఉన్న యాజమానులు పన్ను కట్టేందుకు ముందుకు వస్తున్నారని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఆస్తి పన్ను వసూళ్లలో వివిధ రకాల సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. వాటి కారణంగా చాలా మంది పన్ను చెల్లించేందుకు యాజమానులు ఆలస్యం చేస్తూంటారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఆస్తి పన్ను పరిష్కారం పేరుతో జీహెచ్ఎంసీ ప్రత్యేక మేళాలు రూపొందిస్తోంది. 90 శాతం వడ్డీ రాయితీతో సెప్టెంబర్ 15వ తేదీ వరకు పన్ను చెల్లించేందుకు అవకాశం ఉండటం వల్ల సమస్యలు పరిష్కరించి వీలైనంత ఎక్కువగా పన్ను వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.