గ్రేటర్ హైదరాబాద్(ghmc) పరిధిలో రేపటి నుంచి బతుకమ్మ చీరల(Bathukamma Sarees) పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చీరల పంపిణీ(Bathukamma Sarees) చేస్తామని జీహెచ్ఎంసీ వెల్లడించింది. వృద్ధ మహిళలు నడవలేని పరిస్థితి ఉంటే ఇంటి వద్దకే వచ్చి అందిస్తామని పేర్కొంది. పంపిణీ కేంద్రానికి లబ్ధిదారులు ఆధార్ కార్డు లేదా, ఆహార భద్రత కార్డు తీసుకొని రావాలని సూచించింది. పంపిణీ కేంద్రాల వద్ద సామాజిక దూరం, మాస్కులు ధరించి కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు ఏర్పాటు చేశారు.
గ్రేటర్ పరిధిలో బతుకమ్మ చీరల(Bathukamma Sarees) లబ్ధిదారులు 8లక్షల 50వేలకు పైగా ఉన్నారు. ఇప్పటి వరకు 4,85,120 చీరలు అందుబాటులో ఉన్నాయని జీహెచ్ఎంసీ ప్రకటించింది. పంపిణీ కోసం 17 గోడౌన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. స్థానిక ప్రజాప్రతినిధులు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. వార్డు, సర్కిల్, జోనల్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో పురపాలిక బిల్ కలెక్టర్, స్వయం సహాయక మహిళా ప్రతినిధి, రేషన్ షాపు డీలర్లు సభ్యులుగా ఉంటారని వివరించారు.