తెలంగాణ

telangana

ETV Bharat / state

KOUSHIK REDDY: తెరాస నేత పాడి కౌశిక్​రెడ్డికి జరిమానా విధించిన జీహెచ్​ఎంసీ - Padi Kaushik Redd latest news

తెరాస తీర్థం పుచ్చుకున్న పాడి కౌశిక్​రెడ్డి జీహెచ్​ఎంసీ అధికారులు జరిమానా విధించారు. రూ.5.6 లక్షల ఫైన్​ వేశారు. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు గానూ ఈ చర్యలు తీసుకున్నారు.

KOUSHIK REDDY: తెరాస నేత పాడి కౌశిక్​రెడ్డికి జరిమానా విధించిన జీహెచ్​ఎంసీ
KOUSHIK REDDY: తెరాస నేత పాడి కౌశిక్​రెడ్డికి జరిమానా విధించిన జీహెచ్​ఎంసీ

By

Published : Jul 22, 2021, 5:31 AM IST

పాడి కౌశిక్‌రెడ్డికి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఫైన్​ విధించారు. హైదరాబాద్‌లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని రూ.5.6 లక్షల జరిమానా వేశారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి.. తెరాసలో చేరుతున్న సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో అనుమతి లేకుండా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పలువురు డీఆర్ఎఫ్​కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందం ఈ-చలానాలను వేసింది. రూ.5.6 లక్షల జరిమానా విధించింది. కొన్ని ప్రాంతాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలను డీఆర్​ఎఫ్ బృందాలు తొలగించారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయడంతో జరిమానాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కౌశిక్​రెడ్డితో పాటు జంట నగరాల్లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మరికొందరికీ జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ జరిమానా విధించింది.

తెరాస తీర్థం..

హుజూరాబాద్​ కాంగ్రెస్‌ మాజీ నేత పాడి కౌశిక్‌ రెడ్డి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్​ తెలంగాణ భవన్​లో కేసీఆర్​ సమక్షంలో తెరాసలో చేరారు. కౌశిక్​ రెడ్డికి సీఎం కేసీఆర్​ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. కౌశిక్​తో పాటు అతని అనుచరులు కూడా కారెక్కారు.

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూరాబాద్‌ టికెట్‌ తనకే వస్తుందని కౌశిక్​ రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది. ఈ ఫోన్​ సంభాషణ సోషల్​ మీడియాలో వైరల్​గా మారటంతో కాంగ్రెస్​ కౌశిక్​ రెడ్డికి షోకాజ్​ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్​ సమక్షంలో మంగళవారం తెరాసలో చేరారు.

చేరికలు..

హుజూరాబాద్​ ఉప ఎన్నిక నేపథ్యంలో కౌశిక్​ రెడ్డి తెరాసలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని తెరాస వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా వివిధ పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకుంటుంది. ఈ మధ్య మాజీ మంత్రి ముద్దసాని దామోదర్​ రెడ్డి కొడుకు కశ్యప్​ రెడ్డిని తెరాసలో చేర్చుకున్నారు. అంతకాకుండా దళిత బంధు పథకం అమలుకు హుజూరాబాద్​ను ఫైలెట్​ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంచుకుంది. ​హుజూరాబాద్​ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు కూడా నిధులు విడుదల చేసింది. అయితే ఇక్కడ తెరాస నుంచి పోటీ చేసేది ఎవరో ఇంతవరకు ఆ పార్టీ ప్రకటించలేదు. గులాబీ అధినేత కేసీఆర్​ బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నారని సమాచారం. ఇందుకు సర్వేలు కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: CM KCR: 'ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల అవసరాలను తీరుస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details