తెలంగాణ

telangana

ETV Bharat / state

లబ్‌... డబ్‌... లబ్‌... డబ్‌... కేవలం 24 గంటలే!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొద్ది సమయమే మిగిలి ఉంది. కీలకమైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు.

లబ్‌... డబ్‌... లబ్‌... డబ్‌... అభ్యర్థుల ఎత్తులు పైఎత్తులు
లబ్‌... డబ్‌... లబ్‌... డబ్‌... అభ్యర్థుల ఎత్తులు పైఎత్తులు

By

Published : Nov 30, 2020, 9:04 AM IST

గ్రేటర్​ ఎన్నికల్లో అభర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 24 గంటలే మిగిలి ఉండటం వల్ల నానా హైరానా పడుతున్నారు. కీలకమైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు.

మంతనాలు.. హామీలు

మొత్తం 1,122 మంది (150 డివిజన్లలో) పోటీలో ఉన్నారు. అభ్యర్థులు గెలుపుపై ప్రభావం చూపే అవకాశమున్న బస్తీలు, మురికివాడలు, కాలనీలకు సంబంధించిన పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. మీ పరిధిలోని ఒక్క ఓటు కూడా ప్రత్యర్థులకు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాలంటూ సూటిగా అడిగేస్తున్నారు. కొన్ని డిమాండ్లను అక్కడికక్కడే తీర్చేస్తున్నారు. మరికొన్నింటిని గెలిచిన తర్వాత చూద్దామంటూ హామీ ఇస్తున్నారు. ఇంకొన్నింటికేమో కాగితంపై రాసి ఇస్తున్నారు.

తక్షణం స్పందన

మేడ్చల్‌ జిల్లా పరిధిలోకి వచ్చే డివిజన్‌లో ఓ పార్టీ అభ్యర్థి అసంపూర్తిగా మిగిలిపోయిన గుడి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. మరోచోట గెలుపుపై ప్రభావం చూపే అవకాశమున్న ఓ వర్గం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ. 5 లక్షలు సాయం అందజేశారు. ఇంకో డివిజన్‌లో అయితే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జిమ్‌ను ఏర్పాటు చేసేందుకు కొంత అడ్వాన్స్‌ ఇచ్చారు. గెలిచిన తర్వాత పూర్తిగా భరిస్తానంటూ హామీ ఇచ్చారు.

పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చేలా

గెలుపోటములపై ప్రభావం చూపే ‘పోల్‌ మేనేజ్‌మెంట్‌’ విషయంలో అభ్యర్థులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చేలా కొందరు నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. మరికొందరు ఈ బాధ్యతను కాలనీల వారీగా బంధువులు, అనుచరులకు అప్పగించారు. 2016 బల్దియా, 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓటింగ్‌ శాతం ఆధారంగా లెక్కలు వేసుకున్నారు.

ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టారు. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో అందరూ ఉన్నారా? ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారెవరు? అంటూ తెలుసుకుంటున్నారు. వారికి ఫోన్లు చేసి రవాణా ఖర్చులు మేమే భరిస్తామంటూ హామీ ఇచ్చి రప్పిస్తున్నారు. అవసరమైతే కారు పంపిస్తామంటున్నారు. అందరికీ ఓటరు స్లిప్పులు అందాయా? లేదా? అంటూ అనుచరులతో ఆరా తీయిస్తున్నారు. ఒకవేళ రాకపోతే అప్పటికప్పుడు అందజేస్తున్నారు.

ప్రత్యర్థుల కదలికలపై కన్ను

ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడికెళ్తున్నారు? ఎవరెవర్ని కలుస్తున్నారు? ఎక్కడైనా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారా? అంటూ సమాచారం తెలుసుకునే బాధ్యతను కొందరు ప్రత్యేక వ్యక్తులకు అప్పగించారు. ఫలానా ప్రాంతంలో పంపిణీ చేస్తున్నారని తెలియగానే అక్కడికి మెరుపు వేగంతో చేరుకుని అడ్డుకునేలా మరో బృందాన్ని సిద్ధం చేసుకున్నారు.

జగద్గిరిగుట్టలో ప్రత్యర్థి తరఫున కొందరు వ్యక్తులు డబ్బులు పంచుతుండగా ఓ అభ్యర్థికి చెందిన బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసింది. సరూర్‌నగర్‌లోనూ కొందరు డబ్బులు ఇస్తుండగా ఓ అభ్యర్థి అనుచరులు పట్టుకున్నారు. ఇంకొన్ని డివిజన్లలో కోవర్టుల భయంతో అభ్యర్థులు మూడో కంటికి తెలియకుండా తెరవెనక ఉండి వ్యవహారాలను చక్కబెడుతున్నారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో కొచ్చే డివిజన్‌లో ఓ అభ్యర్థి తన తరఫున ఆ పార్టీ ముఖ్య నాయకుడికి రంగంలోకి దించారు. తనేమో ఎవరికీ అనుమానం రాకుండా అందరితో కలిసి పర్యటిస్తున్నారు.

ఇవీచూడండి: పోలింగ్ కేంద్రాల్లో నిరంతర నిఘా.. ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు

ABOUT THE AUTHOR

...view details