తెలంగాణ

telangana

ETV Bharat / state

తనదైన ముద్రతో.. నేడే మహా సమరం - జీహెచ్​ఎంసీ ఎన్నికలు

హోరాహోరీ ప్రచారాలు.. పరస్పర ఆరోపణలు.. అగ్రనేతల రంగప్రవేశాలు.. పోటాపోటీ మేనిఫెస్టోలు.. అతితక్కువ వ్యవధిలో ఎన్నికలు.. కొవిడ్‌ కాలం.. బ్యాలెట్‌ వినియోగం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

ghmc elections polling start soon With its own imprint
తనదైన ముద్రతో.. నేడే మహా సమరం

By

Published : Dec 1, 2020, 5:56 AM IST

శాసనసభ ఎన్నికలను తలపించే విధంగా ఈసారి బల్దియా ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తింది. తెరాస, భాజపా, ఎంఐఎం నేతలు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో స్థానిక, రాష్ట్ర స్థాయి నేతలే ప్రచారంలో పాల్గొంటుంటారు. కానీ, ఈ సారి భాజపా అభ్యర్థుల తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతోపాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడణవీస్‌ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస తరఫున ప్రధానంగా మంత్రి కేటీఆర్‌ అన్నీ తానై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ జరిగింది. కాంగ్రెస్‌ తరఫున రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 18 ఏళ్ల తర్వాత బ్యాలెట్‌ వినియోగం సహా ఎన్నో విషయాల్లో ఈ సారి బల్దియా ఎన్నికలు విలక్షణంగా నిలిచాయి. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం మామూలుగానే సాగింది.

నేతల మోహరింపు..

పోల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ప్రధాన పార్టీలు తమ నేతలను గ్రేటర్‌లో మోహరించాయి. ఐదారు వేల మంది అన్ని పార్టీల ముఖ్య నేతలు మొదలుకొని క్యాడర్‌ మొత్తం వివిధ డివిజన్లలో తిష్ఠ వేసి వీలైనన్ని ఎక్కువ ఓట్లు తమ పార్టీకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇతర జిల్లాల నేతలు గ్రేటర్‌లో ఉండకూడదని పోలీసులు ఆదేశాలు జారీచేసినా.. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల పేరుతో చాలామంది నేతలు ఇక్కడే ఉండి ‘పర్యవేక్షణ’ చేస్తున్నారు. సోమవారం రాత్రి వరకు నేతల హడావుడి కనిపించింది.

ప్రలోభాల పర్వం..

గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టేందుకు వివిధ పార్టీల నాయకులు పంపకాలకు తెరతీశారు. ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచి ధన ప్రవాహం కట్టలు తెంచుకుంది. బస్తీలు మొదలుకొని అపార్ట్‌మెంట్ల వరకు రకరకాల రూపాల్లో తాయిలాలు అందాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకుల మధ్య కొంత ఘర్షణ చోటుచేసుకుంది. నేతలు బస్తీల్లో మహిళా గ్రూపులతో సమావేశమై డబ్బులు పంచిపెట్టారు. కొందరు అభ్యర్థులు నేరుగా.. మరికొందరు కూపన్లు, గూగుల్‌పే, ఫోన్‌ పే ద్వారా ఓటర్ల ఖాతాలకు నగదు బదిలీ చేశారు. కొన్ని అపార్టుమెంట్లకు రూ.50 వేల నుంచి లక్ష, గేటెడ్‌ కమ్యూనిటీలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పంపకాలు చేసినట్లు సమాచారం. ఇక మద్యం పంపిణీ విచ్చలవిడిగా సాగిందని చెబుతున్నారు.

1,957 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

మొత్తం 74,67,256 మంది ఓటర్లు ఉండగా.. చాలాచోట్ల ప్రతి 500 మందికి ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటైంది. కరోనా బారిన పడిన వారు ఆఖరి గంటలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి మూడు కమిషనరేట్ల పరిధిలో 52 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. 1,957 పోలింగ్‌ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

రాత్రికి పెరిగిన ధర..

  • చివరిరోజు అంతర్గతంగా చేసిన ప్రచారానికి తోడు చివరి అస్త్రంగా కొన్ని డివిజన్లలో నేతలు భక్తి సెంటిమెంట్‌ను ప్రయోగించారు. కార్తిక పూజల్లో ఉన్న మహిళలకు సోదర కానుకల పేరుతో జాకెట్‌ ముక్కలు, వెండి కుంకుమ భరిణెలు పంచారు. పౌర్ణమి సందర్భంగా తూర్పు డివిజన్లలో కొందరు అభ్యర్థుల అనుచరులు కొన్ని అపార్టుమెంట్లలో నగదు, వెండి పూజ సామగ్రిని అందజేశారు.
  • నాగోలులోని ఓ కాలనీలోని అపార్టుమెంట్లపై నీటి ట్యాంకుల ఏర్పాటుకు ఓ అభ్యర్థి ముందుకు రావడంతో గంపగుత్తగా ఒప్పందం కుదిరింది. ఒక్కో అపార్టుమెంటుపై నాలుగేసి ట్యాంకుల ఏర్పాటుకు కాలనీ సంఘాలతో ఒప్పందం చేసుకున్నారు. బండ్లగూడలో కొన్నివాడల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఓ అభ్యర్థి సోమవారం ఒప్పందం చేసుకున్నారు.
  • ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఆది, సోమవారాల్లో తన చికెన్‌ సెంటర్లలో 50% రాయితీ కింద ఓటర్లకు మాంసం విక్రయించారు. డబ్బుల్లేకుంటే ఉచితంగానూ అందించారు.
  • ఇంటింటికీ మాస్కు, శానిటైజర్‌ సీసా పంపిణీ పేరుతో ఎల్బీనగర్‌, సాగర్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతంలోని బస్తీల్లో కొందరు నగదు పంపిణీకి పాల్పడినట్లు తెలిసింది.
  • చివరిరోజైన సోమవారం రాత్రి కొన్నిచోట్ల ఓటుకు రూ.వెయ్యి నుంచి ఆరువేల వరకు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details