కాంగ్రెస్, భాజపాలు పేద ప్రజల నోటి కాడి ముద్దను లాక్కున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కరోనా వచ్చినా- హైదరాబాద్‌లో వరదలొచ్చినా... తెరాస ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడిందని ఆమె గుర్తుచేశారు. అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో గాంధీనగర్ కార్పొరేటర్ అభ్యర్థి ముఠా పద్మ నరేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. తెరాస జైత్రయాత్ర గాంధీనగర్ డివిజన్ నుంచే ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని లక్ష్మీగణపతి దేవాలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆ ఘనత కేసీఆర్‌దే..
మతకల్లోలాలు లేని హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అల్వాల్, మచ్చ బొల్లారం, వెంకటాపురం డివిజన్లకు చెందిన తెరాస అభ్యర్థులు... విజయశాంతి, జితేంద్ర నాథ్, సబితా అల్వాల్ నామపత్రాల దాఖలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంగళ్‌హాట్ సిట్టింగ్ కార్పొరేటర్, తెరాస అభ్యర్థి పరమేశ్వరి సింగ్... అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు మద్దతుగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య వెంట వచ్చారు. గన్‌ఫౌండ్రి నుంచి తెరాస రెబల్ అభ్యర్థిగా శీలం సరస్వతి, భాజపా అభ్యర్థిగా అనితా శైలేందర్ యాదవ్ నామపత్రాలు సమర్పించారు.
పోరులో రెబల్స్..
కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తెరాస తరఫున కేపీహెచ్‌బీ కాలనీ నుంచి మందాడి శ్రీనివాసరావు, ఆల్విన్ కాలనీ డివిజన్ నుంచి వెంకటేశ్‌గౌడ్, కూకట్‌పల్లి నుంచి సత్యనారాయణ, ఓల్డ్ బోయిన్‌పల్లి నుంచి ముద్దం నర్సింగ్‌యాదవ్, అల్లాపూర్ నుంచి సబియా గౌసుద్దీన్ నామినేషన్లు దాఖలు చేశారు. బాలానగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సత్యం శ్రీరంగం, కూకట్‌పల్లి నుంచి తేజేశ్వరరావు నామపత్రాలు సమర్పించారు. అధికార తెరాసతో పాటు విపక్షాల్లోనూ అసమ్మతి వర్గాల నుంచి పలు నామినేషన్లు వెల్లువెత్తాయి. కేపీహెచ్‌బీ కాలనీ నుంచి తెదేపా తరఫున ఇద్దరు, ఆల్విన్ కాలనీలో భాజపా తరఫున నలుగురు, కూకట్‌పల్లి నుంచి ముగ్గురు నామినేషన్లు సమర్పించారు.