అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునే సమయం లేదు.. వ్యూహ ప్రతివ్యూహాలకు ఆస్కారమేలేదు.. కేవలం 14 రోజుల వ్యవధిలోనే ముగినయనున్న క్రతువు.. అధికార పార్టీ మినహా... మిగతా పార్టీలు పోరుకు సన్నద్ధమయ్యేలోపే గ్రేటర్ ఎన్నికలు ముగియనున్నాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక నుంచి ఇతరత్రా వ్యూహాలు అమలుకు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రచారం చేసేందుకూ పార్టీలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వ్యూహాత్మకంగా వెళ్లాలని ప్రధాన పార్టీలు నిర్ణయించాయి. నామినేషన్ల గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో... ఆశావహులు, నేతలతో పార్టీల కార్యాలయాలు సందడిగా కనిపిస్తున్నాయి.
ప్రత్యేక వ్యూహాలతో..
బల్దియా పోరుకు అంతర్గతంగా ఇప్పటికే సిద్ధంగా ఉన్న అధికార పార్టీ.. పోరులో దూసుకెళ్తోంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొన్ని నెలలుగా అన్నీ తానై అభివృద్ధి కార్యక్రమాలపై తనదైన ముద్రవేశారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే మరోవైపు తెరాసను ఆయన ఎన్నికలకూ సన్నద్ధం చేశారు. గత ఎన్నికల్లో తెరాస తరఫున గెలిచిన 99 మంది కార్పొరేటర్లను నిలుపుకునేందుకు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కొన్ని నెలల క్రితమే జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశమైన కేటీఆర్... ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పనితీరు బాగాలేని కొందరిని తీరుమార్చుకోవాలని అప్రమత్తం చేశారు. షెడ్యూల్ విడుదల సమయానికే అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తిచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పోటీలో ఉన్న వారికి ఇప్పటికే సమాచారమిచ్చి... పోరుకు సిద్ధం చేస్తోంది.
బిహార్ ఫలితాల జోరుతో..
జీహెచ్ఎంసీలో రెండో అతిపెద్ద పార్టీ అయిన ఎంఐఎం... గత ఎన్నికల్లో అధికార పార్టీతో కలిసి పోటీ చేయకపోయినా....అవగాహనతో ముందుకు వెళ్లాయి. ఈసారీ కూడా అదే రీతిలో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొన్ని డివిజన్లలో స్నేహపూర్వక పోటీకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్న మజ్లిస్.. గత ఎన్నికల్లో సాధించిన డివిజన్ల సంఖ్యను పెంచుకోవటమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. తమకు పట్టున్న ప్రాంతాలతో పాటుగా.. ఇతర నియోజకవర్గ డివిజన్లపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల బిహార్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెల్చిన ఉత్సాహంలో ఉన్న ఆ పార్టీ.... తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. అందుకు అనుగుణంగా....పార్టీ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.