తెలంగాణ

telangana

ETV Bharat / state

51,500 మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికల బందోబస్తు

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్​కు సర్వం సిద్ధమవుతోంది. ఈ తరుణంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ghmc Election security with 51 thousand police staff in hyderabad
51 వేల పోలీసు సిబ్బందితో ఎన్నికల బందోబస్తు

By

Published : Nov 29, 2020, 7:16 PM IST

అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ ఘట్టం ముగిసింది. ప్రచారానికి తెరపడటంతో.. ఇక అందరి దృష్టి పోలింగ్​పై పడింది. ఇప్పటి వరకు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు విధులు నిర్వహించారు. కీలకమైన పోలింగ్ కోసం పోలీసులు మరింత పకడ్బందీగా ప్రణాళిక రచిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో కలిపి 51,500 మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి డీఆర్సీ కేంద్రాల వద్ద బ్యాలెట్ బాక్సులు పంపిణీ చేయనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా కేంద్రాల వద్దకు పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులను తీసుకుని రానున్నారు. దీంతో డీఆర్సీ కేంద్రాల వద్ద గత కొన్ని రోజులుగా కేంద్ర బలగాలు పహారా కాస్తున్నారు.

పోలింగ్ కేంద్రాలుగా విభజన

సోమవారం బ్యాలెట్ బాక్సులు పంపిణీ చేయనున్న తరుణంలో అదనంగా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా విభజించిన ఉన్నతాధికారులు... ఆయా ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, ఆర్మ్​డ్ రిజర్వ్, స్పెషన్ పోలీసు, అశ్వదళంతో పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను ఏప్పటికప్పుడు గమనించేలా ఏర్పాట్లు చేశారు. రూట్ మొబైల్ టీమ్​లు, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు.

అత్యధికంగా 88 డివిజన్లు

జీహెచ్ఎంసీలో 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 88 డివిజన్లున్నాయి. 1,632 పోలింగ్ స్టేషన్లలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సాధారణ పోలింగ్ కేంద్రాలు 2,146, 1,517 సమస్యాత్మక, 1,138 అత్యంత సమస్యాత్మక, 167 పోలింగ్ కేంద్రాలేమో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.

4,187 లైసెన్సు తుపాకులు డిపాజిట్

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 చోట్ల తనిఖీ కేంద్రాలు, ఇతర కమిషనరేట్ల పరిధిలో 29 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 406 మొబైల్ రూట్ టీంలు ఉండగా.. దాదాపు 22 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 3,066 మందికిపైగా రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్ చేశారు. 4,187 లైసెన్సు కలిగి తుపాకులను డిపాజిట్ చేశారు. కోటీ 45 లక్షల నగదు, 10 లక్షల రూపాయల విలువ చేసే మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఉన్నతాధికారులకు బాధ్యతలు

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లకు సీపీ అంజనీ కుమార్ పోలీస్ ఉన్నతాధికారులను బాధ్యులుగా నియమించారు. షికా గోయల్, చౌహాన్, అనిల్ కుమార్, తరుణ్ జోషి, అవినాశ్ మెహంతికి అప్పజెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 32 డివిజన్లున్నాయి. 674 పోలింగ్ స్టేషన్లలో 2,569 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందులో 770 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. 179 రూట్ మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. 10 డీఆర్సీ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మొహరించారు.

బలగాల పహారా

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 30 డివిజన్లు ఉన్నాయి. 573 పోలింగ్ స్టేషన్లలో 1,640 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందులో 498 సమస్యాత్మక, 101 అతి సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. 101 రూట్ మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. 7 ఫ్లైయింగ్ స్క్వాడ్, 6 ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. 8 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 డీఆర్సీ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి.

అసత్య ప్రచారాలు..

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... వాటిని అరికట్టేందుకు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వచ్చే నెల 1న జరిగే పోలింగ్​లో ఓటర్లందరూ పాల్గొని, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి :ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. మొదలైన తాయిలాల పర్వం

ABOUT THE AUTHOR

...view details