తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ను సమర్థంగా ఉపయోగించుకున్న జీహెచ్​ఎంసీ - జీహెచ్​ఎంసీ వార్తలు

లాక్​డౌన్​ను జీహెచ్ఎంసీ సమర్థంగా ఉపయోగించుకుంది. జంటనగరాల్లో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. న‌గ‌రంలోని ఎస్సార్​డీపీ ప్రాజెక్టుల్లో భాగంగా పై వంతెన‌లు, అండ‌ర్ పాస్​ల‌ను వేగంగా నిర్మించింది. కేవ‌లం లాక్​డౌన్ సమయంలోనే 450 కోట్ల రూపాయల విలువైన రోడ్డు రీ-కార్పెటింగ్ పనులను బ‌ల్దియా పూర్తిచేసింది.

ghmc did road works during lockdown period in hyderabad
లాక్​డౌన్​ను సమర్థవంతంగా ఉపయోగించుకున్న జీహెచ్​ఎంసీ

By

Published : Jul 21, 2020, 10:08 PM IST

జంట న‌గ‌రాల్లో రోడ్లు వేయాలంటే ఇబ్బందులు తప్పవు. తీవ్రమైన ట్రాఫిక్​తోపాటు... ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా నిత్యం ర‌ద్దీగా ఉండే ప్రాంతాల్లో ప‌నులు చేయ‌డం క‌త్తిమీద సామే. క‌రోనా లాక్​డౌన్ స‌మ‌యంలో సుమారు రెండున్నర నెల‌లు ప్రజ‌లు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డాన్ని జీహెచ్ఎంసీ స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకుంది. ఓ వైపు క‌రోనాను అరికట్టేందుకు కంటైన్​మెంట్ జోన్లు ఏర్పాటు చేసింది.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ

హైద‌రాబాద్​ను ట్రాఫిక్ ర‌ద్దీ ర‌హితంగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక ర‌హ‌దారుల అభివృద్ది ప‌థ‌కం కింద రూ. 2,399 కోట్ల వ్యయంతో ఫ్లైఓవ‌ర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ అండ‌ర్ బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్ ఇంజ‌నీరింగ్ విభాగం చేప‌ట్టిన ఈ ప‌నుల్లో దాదాపు రూ. 1,600 కోట్ల విలువైన వివిధ ర‌కాల ప్యాకేజీ ప‌నులు చాలా వ‌ర‌కు పూర్తయ్యాయి. క‌రోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం సూచించిన అన్ని ముందు జాగ్రత్తల‌ను ప‌ని ప్రదేశంలో అమ‌లు చేశారు. ఎక్కువ‌గా యంత్రాల‌ను ఉప‌యోగించి, త‌క్కువ మంది కార్మికుల‌తో భౌతిక దూరం పాటిస్తూ ప‌ని చేయించారు. ఇందులో ఎల్బీనగర్ జంక్షన్ వద్ద ఒకవైపు ఫ్లై ఓవర్, ఒక అండర్ పాస్ పూర్తి చేసి ప్రారంభించారు. కామినేని జంక్షన్ –వద్ద మూడు లేన్ల పై వంతెన పూర్తయింది. పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప‌నులు పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటోంది.

31 కిలో మీటర్ల మేర రోడ్ల రికార్పెట్

గ్రేటర్​ పరిధిలో రెగ్యులర్​గా చేపట్టే పనులకుతోడు ఎస్సార్​డీపీలో భాగంగా వివిధ జంక్షన్లలో చేపట్టిన పై వంతెన‌లు, అండ‌ర్ పాస్​లు వేగంగా చేపట్టి పనులు పూర్తి చేశారు. అందులో కొన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వీటికి తోడు నగరంలోని 709 కిలో మీటర్ల రోడ్లను కాంప్రహెన్సీవ్ రోడ్డు డెవలప్​మెంట్ ప్రోగ్రామ్ కింద రోడ్ల అభివృద్ధి, కార్పెటింగ్ పనులు చేపట్టారు. 331 కిలో మీటర్ల మేర రోడ్లను రికార్పెంట్ చేశారు. అందుకోసం 400 కోట్ల రూపాయలను బ‌ల్దియా ఖర్చు చేసింది. ఇతర రోడ్ల అభివృద్దికి మరో 50 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. వర్షం కారణంగా నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాల్లో వీడీసీసీ రోడ్లను కూడా నిర్మించారు. మిగిలిన పనులను కూడా ఈ నెల చివరికి పూర్తి చేయాల‌ని బ‌ల్దియా ల‌క్ష్యంగా పెట్టుకుంది. మిగ‌తా చోట్ల ప‌నులు ఒక కొలిక్కి వచ్చాయి.

ఇవీ చూడండి: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details