జ్వరంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వారికి సరైన నిర్ధరణ పరీక్షలు చేయకుండానే డెంగీ సోకిందని భయబ్రాంతులకు గురిచేసి డబ్బులు దండుకుంటున్న ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరించాలని బల్దియా కమిషనర్ దానకిశోర్ ఆదేశించారు. పలు ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ చికిత్స పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు.
ఈనెల 16 నుంచి 26 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు
నగరంలో సీజనల్ వ్యాధులు, వాటి నివారణకు చేపట్టిన చర్యలపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్య శాఖ అధికారులు, మలేరియా అధికారులు, ఎంటమాలజి అధికారులతో దానకిశోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్లో పది రోజులపాటు అంటు వ్యాధుల నివారణ, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి 26 వరకు గ్రేటర్లో 600 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించడం ద్వారా పాత్రల్లోనూ ఇంటి పరిసరాల్లోనూ నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగానికి చెందిన 650 బృందాలు పాల్గొంటున్నాయన్నారు.