రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను పకడ్బందీగా నిష్పాక్షకంగా నిర్వహించేందుకు బల్దియా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, పోలీసు ఏసీపీలతో సమన్వయ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది.
సర్కిళ్లవారీగా ఫ్లయింగ్ స్క్వార్డు లు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్‌లను సంబంధిత సర్కిళ్ల నోడల్ అధికారులు ఏర్పాటు చేయాలని కమిషనర్ తెలిపారు. ఈ బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని.. వీటికి మెజిస్ట్రేరియల్ అధికారాలకై న్యాయ శాఖకు ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుందన్నారు. డిప్యూటీ కమిషనర్లు, ఏసీపీలు రూట్ మ్యాప్‌లను రూపొందించాలని కోరారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ దాదాపుగా పూర్తవుతుందన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో సున్నిత, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, వర్నరబుల్ ప్రాంతాలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందని.. ఈ డీఆర్సీ కేంద్రాల వద్ద పోలీసుల సహకారంతో బారీకేడింగ్ చేసే ప్రక్రియను చేపట్టాలని డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ సూచించారు. ఎన్నికలకు సంబంధించి ర్యాలీలు, సమావేశాలకు సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, ఏసీపీలు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
లోక్ సభ, శాసన సభ ఎన్నికలతో పోలిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలు విభిన్నంగా ఉంటాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈసారి ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతో నిర్వహించడం, కరోనా పరిస్థితులు ఇంకా కొనసాగడం వల్ల పోలీసులు మరింత అప్రమత్తతో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ఎన్నికల నోడల్ అధికారిగా జాయింట్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషిని నియమించామని.. మరో రెండు మూడు రోజుల్లో పోలీసు అధికారులకు ఎన్నికల శిక్షణ కార్యక్రమాలను ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఖైరతాబాద్ జోన్‌కు డీసీపీ శ్రీనివాస్, సికింద్రాబాద్ జోన్‌కు కమలేష్, ఛార్మినార్ జోన్‌కు గజరావు భూపాల్‌లను నోడల్ అధికారులుగా నియమించామని అంజనీ కుమార్ తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏ క్షణంలో ప్రకటించినా నిర్వహణకు సిద్దంగా ఉన్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణ విభిన్నంగా ఉంటుందని.. ముఖ్యంగా కరోనాపై చేపట్టాల్సిన జాగ్రత్తలు, పాజిటివ్ ఉన్నవారిని గుర్తించడం లాంటి ప్రత్యేక పరిస్థితులు ఎదురవుతాయన్నారు. ఇటీవల కాలంలో భారీ స్థాయిలో వర్షాలు, వరదలు రావడం, గత సంవత్సరం కాలంగా పాఠశాలలన్నీ మూతపడటం వల్ల పోలింగ్ కేంద్రాలు సరైన పద్దతిలో ఉన్నాయో, లేవో పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక సన్నాహాక సమావేశాన్ని నిర్వహించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు.
ఇదీ చదవండి:దుబ్బాకలో తెరాస పరాజయానికి కారణాలివే..!