హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు వైద్యపరంగా పేదలకు అండగా నిలుస్తున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల నుంచి వస్తున్న ఆదరణతో వీటిని మరింత చేరువచేసే దిశగా జీహెచ్‌ఎంసీ అడుగులువేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా 33 బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దవాఖానాల ఏర్పాటు కోసం వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించింది.
200కు చేరిన దవాఖానాల సంఖ్య
ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్ ఇతర భవనాల్లో 167 బస్తీ దవాఖానాలు కొనసాగుతున్నాయి. ఇందులో మొదటి దశలో 123 దవాఖానాలు ఏర్పాటు చేయగా... రెండో దశలో 44 ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటయ్యే 33తో కలిపితే బస్తీదవాఖానాలు 200కు చేరుకుంటాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతివార్డుకు మూడు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని బల్దియా భావిస్తోంది.
150 రకాల మందులు ఉచితంగా...
ప్రస్తుతం ఉన్న బస్తీ దవాఖనాలతో 14,000మంది వరకు వైద్యసేవలు పొందుతుండగా... కొత్తగా ఏర్పాటుచేసే కేంద్రాల ద్వారా మరో 3,000 మందికి సేవలు అందనున్నాయి. ఒక్కో బస్తీ దవాఖానాలో వైద్యుడు, నర్స్, సహాయకుడు ఉంటారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇవి కాకుండా మరో 85 అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. బస్తీ దవాఖానాల్లో అవుట్ పేషెంట్ సేవలతో పాటు కనీస వైద్య పరీక్షలైన బీపీ, షుగర్‌తో పాటు 57 రకాల పరీక్షలు చేస్తారు. ఇక్కడ సేకరించిన రక్త నమూనాలను తెలంగాణ స్టేట్ డయాగ్నస్టిక్‌కు పంపించి ఫలితాలు నిర్ధరిస్తారు. అంతేకాకుండా 150 రకాల మందులను ఉచితంగా అందిస్తారు. స్వల్ప అనారోగ్యం కలిగే వారికి తక్షణ వైద్య చికిత్సలు అందించడమే కాకుండా టీకాలు వేయడం.. కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సెలింగ్ ఇవ్వడం వంటివి బస్తీదవాఖానాల్లో చేపడుతున్నారు.