కరోనా వైరస్ విస్తరిస్తున్న తొలి రోజుల్లో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకునేవారు. బాధ్యతలను పంచుకునే వారు. దీనివల్ల కరోనా బాధితులను గుర్తించడంతోపాటు సంబంధిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. మార్చి నుంచి జూన్ మొదటి పక్షం వరకు కరోనా నిర్ధారితుల జాబితా రోజువారీగా పోలీసు శాఖకు అందేది.
పోలీసులు తక్షణం స్పందించి బాధితులకు సమాచారం ఇచ్చేవారు. జాబితా అందిన రెండు మూడు గంటల వ్యవధిలోనే బల్దియా అధికారులతో కలిసి, కరోనా సోకిన వ్యక్తిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించే వారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తోడ్పాటు అందించే వారు. సంయుక్త కార్యాచరణ వల్ల తక్షణ వైద్యం లభించేది. వైరస్ సోకిన వ్యక్తి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించేవారు. కంటెయిన్‌మెంట్ జోన్లలో పోలీసులు గస్తీ ఉండేవారు. రాకపోకలు నిషేధించేవారు. తద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించేవారు.
ఈ వ్యవహారంపై ఓ పోలీసు అధికారి ‘ఈనాడు’తో మాట్లాడుతూ ఈ విషయంలో తమ తప్పిదం ఏమీ లేదన్నారు. తమ వద్ద లోపం లేదని, ఫలితాల జాబితా అందిన వెంటనే రోగులకు సమాచారం అందజేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఏమైందో ఏమో?
కారణమేంటో కానీ ప్రభుత్వ ఆదేశాల పేరుతో వైద్య ఆరోగ్య శాఖ పోలీసులకు కరోనా ప్రభావితుల జాబితాను పంపించడం నిలిపేసింది. జాబితాను అర్బన్ ఆరోగ్య కేంద్రాలకు మాత్రమే పంపుతోంది. కొన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో 200-300 కేసులు వస్తుండటంతో సమాచారం ఇచ్చేందుకు 2-3 రోజులు పడుతోంది. వైద్య సిబ్బంది కొరత కూడా ఆలస్యానికి కారణమవుతోంది. నగరపాలక సంస్థ ఉద్యోగులు పెద్దఎత్తున కరోనా బారినపడ్డారు.
గతంలో కొవిడ్ బాధితుడి ఇంటికి 108 వాహనంతో పరుగులు పెట్టే సిబ్బంది ఇప్పుడు ఆ వైపే చూడటం లేదు. అనుమానితులే ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి. ఫలితాలు ఆలస్యంగా తెలుస్తుండటంతో కరోనా లక్షణాలతోనే పలువురు బయట తిరుగుతున్నారు. కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. నగర వ్యాప్తంగా ఇలాంటి వారు చాలామంది ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామమే వైరస్ విస్తరణకు దారితీస్తోందని నిపుణులు అంటున్నారు. మరోసారి లాక్‌డౌన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఈ లోటుపాట్లను సరిదిద్దితేనే వైరస్ వ్యాప్తిని నిరోధించగలమని సూచిస్తున్నారు.
బస్తీల్లో కరోనా జాస్తి!
కరోనా మహమ్మారి బస్తీలను చుట్టేస్తోంది. అక్కడి ప్రజలు మాస్కులు సరిగా ధరించకపోవడం, ఎడం పాటింకపోవడం వల్ల వేగంగా వ్యాపిస్తోంది. సోమవారం గ్రేటర్‌లో 861 మందికి వైరస్ సోకింది. సోమవారం మరణించిన వారిలో ఓ ట్రాఫిక్ ఏఎస్‌ఐ(57) ఉన్నారు. ఒక్క అంబర్‌పేట సర్కిల్‌లోనే బాధితులు 94 మంది ఉండటం గమనార్హం. పేద, మధ్య తరగతి ప్రజలు ఉండే ఈ సర్కిల్‌లో మార్చి, ఏప్రిల్‌లో పెద్దగా కేసులు వెలుగుచూడలేదు. మే ఆరంభం నుంచి కేసులు పెరుగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు సర్కిల్‌లో 731 మంది మహమ్మారి బారినపడ్డారు.
వాహకాలుగా దుకాణాలు
ముషీరాబాద్ సర్కిల్‌లోనూ 300 మందికి వైరస్ సక్రమించింది. రెండు సర్కిళ్ల పరిధిలో వారాంతపు సంతలు, మార్కెట్లు, కిరాణ దుకాణాలు వాహకాలుగా మారాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, చార్మినార్ జోన్లలోని పలు బస్తీల్లో వైరస్ విలయతాండవం చేస్తోంది. దినసరి కూలీలు, సాధారణ ఉద్యోగులు, గృహిణులు, వృద్ధులకు సోకుతోంది. ఫీవరాసుపత్రికి సోమవారం 54 మంది కరోనా లక్షణాలతో వచ్చారు. కాచిగూడ రైల్వేస్టేషన్ రిజర్వేషన్ విభాగంలోని ఓ ఉద్యోగినితోపాటు పలువురు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇదీ చదవండి:1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం