GHMC All Party Meeting in HYD: గ్రేటర్ హైదరాబాద్‌లో కుక్కల బెడదపై జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మీ అధ్యక్షతన జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ వాడీవేడిగా జరిగింది. నిధుల కేటాయింపు చేయకుండా తక్కువ మంది సిబ్బందితో కుక్కల నియంత్రణ ఎలా సాధ్యమవుతుందని ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు నిలదీశారు. కుక్కల సమస్యపై గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బల్డియాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని వాపోయారు. నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తుంటే ఏం చేస్తున్నారని మేయర్‌పై మండిపడ్డారు. కుక్కలకు ఆకలి వేసి కరుస్తున్నాయంటూ ఎలా మాట్లాడుతున్నారని బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రశ్నించారు.
ప్రదీప్ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం: అంబర్‌పేట కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి సమావేశంలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. జీహెచ్ఎంసీ నుంచి 8 లక్షలు.. ఆల్ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న కార్పొరేటర్ల ఒక నెల జీతం రూ.2లక్షలతో మొత్తం కలిపి 10లక్షల రూపాయల పరిహారం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని త్వరలోనే చనిపోయిన బాలుడి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.
అరకొరగానే సిబ్బంది: అంబర్‌పేటలో కుక్కల దాడి ఘటన తర్వాత కుక్కల నియంత్రణ వ్యాక్సినేషన్ పనుల్లో వేగం పెంచినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. అయితే కావల్సినన్ని సౌకర్యాలు లేని అధికారులు తెలిపారు. కుక్కలను పట్టి వ్యాక్సినేషన్ వేసేందుకు నగరంలో 30 సర్కిళ్లలో కేవలం 364 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారన్నారు. ఇంకా 30 వాహనాలు, ఆపరేషన్లు చేసేందుకు కేవలం ఐదు ఆపరేషన్ థియేటర్లు, షెల్టర్ హోంలు మాత్రమే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కుక్కలు పట్టేందుకు వాటికి వ్యాక్సినేషన్ వేసేందుకు సిబ్బందిని వెయ్యిమందికి పెంచాలని.. ప్రతి సర్కిల్‌కు రెండు నుంచి మూడు వాహనాలు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సమావేశంలో కుక్కల నివారణ కోసం ఓ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు.
నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ అంబర్‌పేటలో ప్రదీప్ అనే నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాలుడు నడుచుకుంటూ వెెళ్తుండగా కుక్కలు వెంటబడ్డాయి. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రదీప్ ఆసుపత్రిలో చనిపోయాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన తరువాత నగరంలో వరుసగా పలుచోట్ల కుక్కల దాడులు పెరగడంతో జీహెచ్ఎంసీపై ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో కుక్కలకు ఆకలై దాడులు చేస్తున్నాయని మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హైకోర్టు కూడా పేపర్లలో వచ్చిన వార్తను సుమోటోగా స్వీకరించి రాష్ట్రప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది.
ఇవీ చదవండి: