Genome sequencing in gandhi hospital: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా త్వరలో గాంధీలో జీనోమ్ సీక్వెన్సింగ్ ఏర్పాటు చేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఒమిక్రాన్‌కు కొత్తగా చికిత్స లేదని పేర్కొన్నారు. ఐదు రోజుల క్రితం సోమాలియా నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తికి గాంధీలో చికిత్స కొనసాగుతోందని చెప్పారు.
మొదట నెగెటివ్.. తర్వాత పాజిటివ్
Covid Treatment in Gandhi: సోమాలియా వాసికి.. రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ నెగెటివ్‌గా తేలిందని రాజారావు అన్నారు. కానీ తర్వాత అతనికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. వెంటనే ఆ వ్యక్తిని అక్కడి నుంచి గాంధీకి తరలించినట్లు పేర్కొన్నారు. అతడి నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని.. ఒమిక్రాన్ సోకిందో లేదో ఇంకా నిర్ధరణ కాలేదని వివరించారు. బాధితుడికి ఇతర జబ్బులు కూడా ఉన్నాయని.. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు.
ఆలస్యమవుతుండటంతో
ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా పాజిటివ్‌గా తేలితే నమూనాలు తీసుకొని సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయోగ్నోసిస్(సీడీఎఫ్‌డీ)కు పంపుతున్నారని రాజారావు అన్నారు. అక్కడ నుంచి 2-3 రోజుల తర్వాత ఫలితాలు అందుతున్నాయని.. దీంతో ఎక్కువ నమూనాలు విశ్లేషించడంలో జాప్యం జరుగుతున్న దృష్ట్యా గాంధీలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
కరోనా నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి మైక్రోబయాలజీ విభాగంలో ఒమిక్రాన్ కేసులకు సంబంధించి జీనోమ్ విశ్లేషణ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ పరీక్షలు ప్రారంభిస్తాం. తొలుత ఆర్టీపీసీఆర్ విధానంలో పరీక్షించి తర్వాత వైరస్ కణ నిర్మాణానికి సంబంధించి ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏలతోపాటు అమినోయాసిడ్స్ సీక్వెన్స్‌ను పరిశీలిస్తాం. దీంతో ఎక్కువ సంఖ్యలో నమూనాలు విశ్లేషించడానికి వీలు ఏర్పడనుంది. ప్రస్తుతం గాంధీలో 27 మంది వరకు కరోనా బాధితులు ఉన్నారు. అన్నీ డెల్టా వేరియంట్ కేసులే. రానున్న రెండు నెలలు చాలా కీలకం కానున్నాయి. ప్రజలు ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే ఫిబ్రవరి, మార్చిల్లో మూడో దశ ఖాయం. ఈ నేపథ్యంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.-డాక్టర్ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్
ఇదీ చదవండి:Covid Cases in India: 572 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు