కొవిడ్ వల్ల విధించిన లాక్‌డౌన్‌తో ఎంతోమందికి ఆదాయ మార్గాలు సన్నగిల్లాయి. ప్రతి ఇంట్లో అనారోగ్యంతో బాధపడేవారు ఒకరో ఇద్దరు ఉంటారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటివి సర్వసాధారణం. ఇలాంటి కుటుంబాల్లో సాధారణ బడ్జెట్‌తోపాటు వైద్యుల ఫీజులు, మందుల ఖర్చు అదనం. గత కొన్నినెలలుగా మల్టీ విటమిన్లు, యాంటిబయోటిక్స్ తదితరాలకు డిమాండ్ పెరిగింది. పలు బ్రాండెడ్ ఔషధాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ తరుణంలో అంతా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. అటు జేబుకు చిల్లుపడకుండా, ఇటు తమ అవసరం తీరేలా చూసుకుంటున్నారు. జనరిక్ మందులు చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకుంటున్నాయి. బీపీ, షుగర్ మాత్రలు 50-70 శాతం తక్కువకే లభ్యమవుతున్నాయి. ప్రధానమంత్రి జన ఔషధి కింద జనరిక్ దుకాణాలను అంతటా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సమీపంలో వీటిని తెరిచారు. సాధారణ అనారోగ్యాలకు అవసరమైన ఔషధాలు ఉంచారు.
ప్రభుత్వ దవాఖానాల్లో...
భాగ్యనగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, పేట్లబుర్జు, కింగ్‌కోఠి, నిలోఫర్ ఆసుపత్రుల వద్ద ఉన్న జనరిక్ ఔషధ దుకాణాల్లో 20-30 శాతం మంది కొనుగోలు చేస్తున్నారు. నొప్పి నివారణ, దగ్గు, జలుబు, జ్వరం మాత్రలే కాక ఇతర వ్యాధులకూ ఔషధాలు ఈ దుకాణాల్లో ఉంటాయన్న అంశంపై ప్రచారం అవసరం. వైద్యులూ సూచించాలి. అప్పుడే పేదల ఖర్చులు తగ్గుతాయి.
నాకు బీపీ, షుగర్ ఉండగా నా భార్యకు బీపీ ఉంది. వచ్చే కొద్దిపాటి పింఛను సొమ్ముతోనే మేము సర్దుకోవాలి. ఇంతకుముందు మా ఇద్దరి మందులకే రూ.3-4 వేలు అయ్యేవి. వైద్యులకు చెబితే జనరిక్ ఔషధాలు సూచించారు. ఇప్పుడు ఖర్చు సగం తగ్గింది. ప్రతి నెలా ఇవే వాడుతున్నాం. వ్యాధులూ నియంత్రణలో ఉన్నాయి.