దేశంలో భాష, సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ప్రజలకు దిశానిర్దేశం చేసిన మహనీయుల జీవితాల గురించి ముందు తరాలు తెలుసుకోవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Vice President Venkaiah Naidu) అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పలువురు రచయితలు తాము రాసిన పుస్తకాలను ఉపరాష్ట్రపతికి అందజేశారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన వివిధ పుస్తకాలను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ... ఉపరాష్ట్రపతికి అందజేశారు. పీవీ దేశానికి చేసిన సేవలు యువతకు తెలియజేసేలా పరిశోధనాత్మకంగా ఈ పుస్తకాలను ప్రచురించే చొరవ తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవ కమిటీకి ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు.
ఇదే మార్గంలో మరిన్ని పుస్తకాలను అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. దక్కన్ ప్రాంతంలోని ఉర్దూ రచయితల జీవిత విశేషాలు తెలియజేస్తూ ప్రముఖ పాత్రికేయులు ఇఫ్తేకార్ రచించిన "జెమ్స్ ఆఫ్ దక్కన్" పుస్తకం ఉపరాష్ట్రపతికి అందజేశారు. ఉర్దూ భాషను అమితంగా అభిమానించే వారిలో తానూ ఒకరినన్న ఉపరాష్ట్రపతి... భవిష్యత్ తరాలు తెలుసుకోవలసిన విశేషాలతో మంచి పుస్తకం అందించిన వారికి అభినందనలు తెలిపారు.