Bollaram Rashtrapathi Nilayam: సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయాన్ని సాధారణ ప్రజలు.. ఇక నుంచి ఏడాది పొడవునా సందర్శించే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం, ప్రభుత్వం సెలవు దినాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చునని తెలిపింది. అయితే గతంలో రాష్ట్రపతి శీతాకాల విడిది అనంతరం పక్షం రోజుల పాటు ప్రజల సందర్శనకు అవకాశం ఉండేది. ఈ క్రమంలోనే 162 ఏళ్ల రాష్ట్రపతి నిలయం చారిత్రక ప్రాధాన్యం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉగాది పర్వదినం సందర్భంగా ఈ మార్చి 22వ తేదీ నుంచి రాష్ట్రపతి నిలయంలోకి ఏడాది పొడవునా వెళ్లే వెసులుబాటు రానుంది. సాధారణ ప్రజల సందర్శనను ఉగాది రోజున.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి నిలయం ప్రాంగణంలోని మెట్లబావి, జైహింద్ ర్యాంపు పునరుద్ధరణకు.. చారిత్రక ఫ్లాగ్ పోస్ట్ ప్రతి రూపానికి వర్చువల్ విధానంలోనే రాష్ట్రపతి శంకుస్థాపన చేయనున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశంతో.. రాష్ట్రపతి నిలయంలోని గార్డెన్స్‌తో పాటు ఇక నుంచి చారిత్రక భవనాన్ని కూడా సాధారణ ప్రజలు సందర్శించే అవకాశం ఉంటుంది. ఆధునీకరించిన ఆర్ట్ గ్యాలరీ, భూగర్భ సొరంగ మార్గం, రాక్ గార్డెన్, హెర్బన్ గార్డెన్, బట్టర్ ఫ్లై గార్డెన్, నక్షత్ర గార్డెన్, జైహింద్ ర్యాంపు, ఫ్లాగ్ పోస్ట్ తదితరాలను సందర్శించవచ్చు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు ఈ మార్చి 14 నుంచి ఆన్లైన్లో ప్రజలు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది.