తెలంగాణ

telangana

ETV Bharat / state

GANDHI HOSPITAL: నేటి నుంచి సాధారణ వైద్యసేవలు.. కొవిడ్​ బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు - గాంధీలో సాధారణ వైద్యసేవలు ప్రారంభం

కరోనా బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ.. గాంధీలో నేటి నుంచి సాధారణ వైద్య సేవలు తిరిగి ప్రారంభించన్నున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు వెల్లడించారు. వైద్య సేవలకు వచ్చేవారు విధిగా మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించాలని సూచించారు.

GANDHI HOSPITAL
గాంధీ ఆసుపత్రి

By

Published : Aug 3, 2021, 7:01 AM IST

గాంధీ ఆసుపత్రిలో సాధారణ వైద్యసేవలు నేటి (మంగళవారం) నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 16వ తేదీ నుంచి ఆసుపత్రిలో సాధారణ వైద్యసేవలను పూర్తిగా నిలిపివేసి.. కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చివేసిన విషయం తెలిసిందే. నెల రోజులుగా కరోనా, బ్లాక్‌ఫంగస్‌ రోగుల తాకిడి తగ్గుముఖం పట్టడంతో సాధారణ వైద్యసేవలు అందించాలని నిర్ణయించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం కరోనా, బ్లాక్‌ఫంగస్‌ రోగులు 350 మందిలోపే ఉన్నారు. కరోనా రోగులకు రెండు, మూడు అంతస్తుల్లోని కొన్ని వార్డుల్లో, బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు నాలుగో అంతస్తులోని వార్డుల్లో వైద్యం అందిస్తున్నారు. ఓపీ, ఎమర్జెన్సీ, ఐసీయూ వార్డులను సాధారణ రోగులకే వినియోగించనున్నారు. ఓపీ బ్లాక్‌లో ఎప్పటిలాగే వైద్యసేవలు అందిస్తారు.

ఇబ్బందులు లేకుండా..

పేదల పెద్దాస్పత్రి గాంధీలో మూడున్నర నెలల తర్వాత సాధారణ వైద్య సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్ సెకండ్​ వేవ్​లో కరోనా కేసుల ఉద్ధృతి పెరగటంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో కొవిడ్ నోడల్ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొవిడ్ రోగులతో పాటు.. కరోనా ఉండి బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి సైతం గాంధీలో సేవలు అందిస్తున్నారు. అయితే ఇటీవల కరోనా కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల తిరిగి గాంధీలో సాధారణ వైద్య సేవలు ప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. సీజనల్ వ్యాధులు పెరగటం, యాక్సిడెంట్ కేసులు వెరసి ఉస్మానియా ఆస్పత్రిపైనా భారం పెరిగింది. ఫలితంగా సాధారణ రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

గతేడాది మార్చి 24 నుంచి నవంబర్ వరకు కేవలం కొవిడ్ కేసులకు మాత్రమే చికిత్స అందించిన గాంధీ ఆస్పత్రి.. ఈ ఏడాది సైతం ఏప్రిల్ 17 నుంచి కొవిడ్ నోడల్ కేంద్రంగా సేవలు అందించింది. వేలాది మంది ప్రాణాలను నిలిపిన గాంధీ ఆస్పత్రి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం వల్ల నేటి నుంచి సాధారణ సేవలు అందించేందుకు సన్నద్ధమైంది.

సదుపాయాలపై పాలన యంత్రాంగం దృష్టి

ఆసుపత్రిలో సాధారణ వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కొత్త పరికరాలను సమకూర్చుకోవడంలో పాలన యంత్రాంగం నిమగ్నమైంది. శస్త్రచికిత్సల నిమిత్తం సీ-ఆర్మ్‌ పరికరాలను రూ.75 లక్షలతో సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టింది. రూ.16 లక్షలతో ఆరో అంతస్తులోని ఆపరేషన్‌ థియేటర్ల ఆధునికీకరణ పనులు చేపట్టారు. వివిధ వార్డుల్లో మరమ్మతులు జరుగుతున్నాయి. ఆసుపత్రి సెల్లార్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో మరో వంద వరకు సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. సాధారణ వైద్య సేవలకు వచ్చేవారంతా విధిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు పేర్కొన్నారు. శానిటైజర్లను వెంట తెచ్చుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి:'అక్టోబర్​లో తీవ్రస్థాయికి కరోనా థర్డ్​వేవ్'

కేరళలో తగ్గిన కరోనా ఉద్ధృతి - కొత్తగా 13,984 కేసులు

ABOUT THE AUTHOR

...view details