ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రజలు భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 25 అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల ద్వారా అస్వస్థతకు గురైన వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. సింహాచలం డిపోనుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు.