Garbage Removal At Hussain Sagar :గణేశ్నిమజ్జనం రోజు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు ఎంత అందంగా ఉంటాయో.. నిమజ్జనం తర్వాత అంత దారుణంగా మారుతుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వద్ద పరిస్థితులు అంతే దారుణంగా కనిపిస్తున్నాయి. గణేశ్ నిమజ్జనం(Ganesh Nimajjanam) తర్వాత పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనిలో బీజీగా ఉంది హెచ్‌ఎండీఏ. మరోవైపు ఈ నిమజ్జనం సమయంలో వివిధ రకాల వస్తువులు, పదార్థాలతో చెత్తాచెదారం పేరుకుపోయిన రహదారులను శుభ్రం చేసే పనిలో పడిపోయింది జీహెచ్ఎంసీ.
Hussain Sagar Cleaning Hyderabad :గణేశ్ నిమజ్జనం పూర్తి కావడంతో హెచ్‌ఎండీఏ(HMDA) హుస్సేన్ సాగర్‌లో వాటి వ్యర్థాల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను గత నాలుగు రోజులుగా జీహెచ్ఎమ్సీ(GHMC) సిబ్బంది తొలగిస్తున్నారు. ఎక్కువ భాగం విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(POP Idols)తో చేసినవి కావడం వల్ల వాటిని అలాగే నీటిలో వదిలేసినా, ఎక్కువ రోజులు ఉంచినా అది నీటిలో కలిసి నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే క్రేన్ల సాయంతో వినాయక ప్రతిమలను, వ్యర్థాలను, ఇనుప చువ్వలను తొలగిస్తూ ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక వాహనాల్లో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు.
Waste Disposal AtHussain Sagar :పూలు, సామగ్రి, ఇతర చెత్తా చెదారం, వస్త్రాలు కాగితాలు సైతం జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని వినాయకుల నిమజ్జనం పూర్తి కాలేదు. ఈ రోజు సాయంత్రం వరకు మిగిలిన విగ్రహాల నిమజ్జనం(Ganesh Idols Nimajjanam) కూడా పూర్తవుతుందని.. ప్రతిరోజు ఒక ట్రక్కు ఐదారు ట్రిప్పుల వ్యర్థాలను తరలిస్తున్నామని హెచ్‌ఎండీఏ సిబ్బంది తెలిపారు. పూర్తిగా హుస్సేన్‌సాగర్‌లోని వ్యర్థాల తొలగింపుకు మరో రెండు మూడు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు.