GOVERNMENT HOSPITALS: ఇదే పరిస్థితి రాష్ట్రంలోని చాలా ఆసుపత్రుల్లో ఉంది. రోగులుండే వార్డుల్లో శునకాలు తిరుగుతున్నాయి. పరిసరాల్లో భరించలేనంత దుర్వాసన సాధారణమైపోయింది. ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారాన్ని పారవేస్తుండడంతో ఆసుపత్రుల ఆవరణలో అపరిశుభ్రత తాండవిస్తోంది. అనేక చోట్ల మానవ అవయవ వ్యర్థాల నిర్వహణ సైతం లోపభూయిష్టంగా ఉంది. రోగుల సహాయకులు ఆరుబయటే పడుకోవాల్సిన పరిస్థితుల్లో పిల్లులు, పందుల బెడదతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య సమస్యలపై ‘ఈనాడు- ఈటీవీ భారత్’ క్షేత్రస్థాయి కథనం.
పరిశుభ్రతా.. నీవెక్కడ?
ఉస్మానియా:కులీకుతుబ్‌షా భవనం 4వ అంతస్తులో వ్యర్థాల సంచులను పడేస్తున్నారు. శస్త్రచికిత్స థియేటర్లు, వార్డుల్లో తరచూ రసాయన ప్రక్రియ చేపట్టకపోవడంతో దుర్గంధం నెలకొంటోంది. ఆసుపత్రి ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలగించడం లేదు. వార్డుల్లో కుక్కలు, పిల్లుల సంచారం మామూలుగా మారింది. సమీపంలోనే మూసీ నది ఉండడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.
గాంధీ:పలు విభాగాలకు నెలవైన గాంధీ ఆసుపత్రి సెల్లార్‌లో మ్యాన్‌హోళ్లు తరచూ పొంగిపొర్లుతుండడంతో పరిస్థితి దుర్భరంగా ఉంది. డ్రైనేజీలు పొంగి వంటశాల విస్తరించిన బ్లాక్ మొత్తం మురుగుమయంగా మారింది. పందికొక్కులు, ఎలుకలు చేరి రంధ్రాలు చేస్తున్నాయి. కూరగాయలు తరగడం, వంటలు వండడం, వార్డుల్లోకి తరలించడం వరకూ అంతా ఆ మురికి కూపంలోనే చేయాల్సి వస్తోంది.
మహబూబ్‌నగర్: ఆసుపత్రికి ప్రధాన ద్వారం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రాంగణంలో పందులు, కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఆసుపత్రిలోపల బొద్దింకలు, నల్లులు, ఎలుకల బెడద తీవ్రంగా ఉంది. మురుగునీటి కాలువ నిర్వహణలో సమస్యలుండడంతో ప్రాంగణమంతా దుర్వాసన వెదజల్లుతోంది.
రంగారెడ్డి: జిల్లా ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లోనూ ఎలుకలు తవ్విన గుంతలు దర్శనమిస్తున్నాయి. మూషికాలు ఎక్కడ పడితే అక్కడ పైపులను ధ్వంసం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం వెనుక విభాగంలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పాముల సంచారం భయపెడుతోంది.
కరీంనగర్: కరోనా అనుమానిత కేసుల వార్డు, సర్జికల్ వార్డులకు ఇరువైపులా ఉన్న ఓపెన్ డ్రైైనేజీ ద్వారా ఎలుకలు, పాములు వస్తున్నాయి. భరించలేని దుర్వాసనతో రోగులు, సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.ఆసుపత్రికి నలువైపులా గేట్లు తీసి ఉంచడంతో ఆవరణలో కుక్కలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి.