Ganjayi Smuggling Gang Arrested Hyderabad :కర్ణాటకలోని బీదర్ జిల్లా విజయ్‌నగర్ తండాకు చెందిన సాకారం రాఠోడ్ 5వ తరగతి వరకు చదివి మానేశాడు. ఉపాధి కోసం 2002లో హైదరాబాద్‌కు వచ్చి షేక్‌పేట వద్ద పానీపూరి బండి వద్ద పనిచేశాడు. ఆరేళ్ల తర్వాత తనే సొంతంగా ఓ పానీపూరి బండి పెట్టుకున్నాడు. బాగా డబ్బులు సంపాదించాలనుకున్న అతనికి.. పానీపూరి వ్యాపారంలో పెద్దగా డబ్బులు మిగల్లేదు. రోజు వచ్చే ఆదాయం, ఖర్చులు పోనూ రెండు మూడు వందల వరకు మాత్రమే మిగిలేది.
రెండేళ్ల పాటు పానీపూరీ బండి నడిపి ఆ తర్వాత లాభం లేదనుకొన్న సాకారాం.. 2012లో హైదరాబాద్ నుంచి తిరిగి స్వగ్రామం వెళ్లాడు. జన్వాడ చక్కెర పరిశ్రమలో లేబర్ కాంటాక్టర్ గా పనిచేస్తున్న తండ్రికి సాయంగా ఉన్నాడు. అక్కడి కూలీలు గంజాయి సేవించడం.. దాన్ని విక్రయించే వాళ్లు డబ్బులు సంపాదించడాన్ని సాకారాం చూశాడు. గంజాయికి బాగా డిమాండ్ ఉన్నట్లు గుర్తించిన సాకారాం..గంజాయి విక్రయించిడబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
Ganjayi Gang Arrested in Hyderabad :ఈ మేరకు లక్ష్మణ్, కాశీరాం, రవిల సహకారంతో ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు. కేవలం బీదర్‌లోనే కాకుండా మహారాష్ట్రలోనూ గంజాయి సరఫరా చేశాడు. థానేకు చెందిన అజయ్ చౌరాసియాతో సాకారాంకు పరిచయం ఏర్పడింది. అజయ్ చౌరాసియా సైతం ముంబయి, థానేతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా చేసేవాడు. గంజాయి సరఫరా చేస్తూ సాకారాం ఇప్పటికే 5 సార్లు పోలీసులకు దొరికిపోయాడు.
Ganjayi Smuggling in Pushpa Movie Style : సంగారెడ్డి, ఓయూ పోలీస్ స్టేషన్, వీఎం బంజర, వరంగల్, పటాన్ చెరువు పీఎస్‌లలో సాకారాంపై కేసులున్నాయి. జైలు నుంచి బయటికి వచ్చిన సాకారాం వెంటనే తిరిగి గంజాయి సరఫరా చేయడం మొదలుపెట్టాడు. థానేలో గంజాయి విక్రయించడానికి పెద్ద మొత్తంలో కావాలని అజయ్ చౌరాసియా.. సాకారాం రాఠోడ్‌ను కోరాడు. దీంతో సాకారాం తన సోదరుడు జైదేవ్ చౌహాన్ సాయంతో ఓ డీసీఎం కొనుగోలు చేశాడు. గంజాయి సరఫరాలో సహకరించాల్సిందిగా సోదరుడిని కోరడంతో దానికి ఆయన అంగీకరించారు. డీసీఎం నడిపేందుకు అహ్మద్ ఖాన్, రాముని నియమించుకున్నాడు.