తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లలే లక్ష్యంగా చాకెట్లలో గంజాయి - విద్యార్థులు జర భద్రం - Ganjay Gang Arrest in Telangana

Ganjay Chocolate Case in Rangareddy : గంజాయి తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తున్న మత్తు పదార్థం. పోలీసులు ఎప్పటికప్పుడు గంజాయి సరఫరాను అడ్డుకుంటున్నా ఏదో ఒకదారిలో సమాజంలో అది చిచ్చురేపుతునే ఉంటోంది. ఐతే, ఇప్పటికే దీని బారిన పడి ఎంతోమంది యువత ఇబ్బందుల పాలవుతుంటే ఇప్పుడు చిన్నపిల్లలను గంజాయి ముఠాలు లక్ష్యంగా ఎంచుకుంటున్నాయి. గంజాయి కలిపిన చాక్లెట్లు అందిస్తూ వారి ఆరోగ్యాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. ఐతే, ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ తెలుగురాష్ట్రాల్లో గంజాయి చాక్లెట్లు, గంజాయి వినియోగంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఐనా తుతుమంత్రం చర్యలతో ఇప్పుడు వాటి జాడ ఎక్కడ పడితే అక్కడ కన్పిస్తోంది. ఎన్ని చర్యలు చేపట్టినా నిర్మూలన కష్టతరంగా మారింది. గంజాయి వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంటే నేరాల పరిస్థితేంటో తెలుసుకుందాం.

Ganjay Gang Arrest in Telangana
Ganjay chocolate case in Rangareddy

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2024, 10:30 PM IST

పిల్లలే లక్ష్యంగా చాకెట్లలో గంజాయి- విద్యార్థులు జర భద్రం

Ganjay Chocolate Case in Rangareddy : తులసివనంలో గంజాయి మొక్కలు ఏపుగా పెరిగితే ఏమవుతుంది? అది మెుత్తం తులసి వనాన్నే నాశనం చేస్తుంది. దానిని చూడటం తప్ప చేసేదేమీ లేదంటున్న ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తే. ఒకప్పుడు యువతను టార్గెట్గా చేసుకుని గంజాయిని అలవాటు చేసేవారు. కానీ, పరిస్థితులు మారాయి. ఇప్పుడు వీరి కన్ను పచ్చని విద్యాలయాలపై పడ్డాయి. ఇంజినీరింగ్, డిగ్రీ, ఇంటర్ నుంచి ఏకంగా పాఠశాలలకు గంజాయి ముఠాలు చేరుకున్నాయి. వారి అక్రమ సంపాదన కోసం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ను నాశనం చేస్తున్నాయి. అందుకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు ఘటన ఒక ఉదాహరణగా కన్పిస్తుంది. గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయించి చిన్నపిల్లల్ని కూడా మత్తుకు బానిసలుగా మార్చుతున్న ముఠాను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పరిశ్రమల్లోని కార్మికులకు అమ్మేందుకు తీసుకువచ్చి వాటిని పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు.

ఏంటీ! రాష్ట్రంలో గంజాయి వ్యసనపరులు మరీ అంతమంది ఉన్నారా? జాగ్రత్త సుమీ

Ganjay Cases in Telangana : ఒడిశా నుంచి బతుకుతెరువు కోసం ఏడాది కిందట కొత్తూరు పారిశ్రామిక ప్రాంతానికి వలస వచ్చారు ముగ్గురు వ్యక్తులు. వారు ఆర్ధిక ఇబ్బందులతో సులువుగా డబ్బు సంపాదించాలని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొత్తూరు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు గంజాయి చాక్లెట్లు అమ్మాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం నివాసముంటున్న ప్రాంతంలోనే ఒక కిరాణా జనరల్ స్టోర్​ను ప్రారంభించారు. ఒడిశా జాజాపూర్ జిల్లా మంగల్పూర్ నుంచి గంజాయి కలిపిన చాక్లెట్లు తక్కువ ధరలో కొనుగోలు చేసి రైళ్లలో తీసుకొచ్చే వాళ్లు. అనుమానం రాకుండా ఆ చాక్లెట్లకు చార్మినార్ గోల్డ్ మునక్క(Charminar Gold Munakka) అని పేరు పెట్టారు. అలా తీసుకొచ్చిన చాక్లెట్లు వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు పరిశ్రమ బైటే రూ.9 ఒకటి చొప్పున అమ్మేవారు. అవే చాక్లెట్లను పిల్లలకు మాత్రం మెుదటగా ఉచితంగా అందించి వారు అలవాటైన తర్వాత రూ.20 విక్రయించేవాళ్లు. అనుమానం రాకుండా కిరాణా సామాన్ల మధ్య రహస్య ప్రదేశాల్లో చాక్లెట్ల దాచేవాళ్లు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాదాపు 8 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

చాక్లెట్లు తిని విద్యార్థుల వింత ప్రవర్తన - ఆరా తీస్తే గంజాయి ముఠా గుట్టురట్టు

పిల్లలే లక్ష్యంగా : దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది కార్మికులు రంగారెడ్డి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. ఒడిశా,ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్, బిహార్, కర్ణాటక, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాల నుంచి కార్మికులు, వారి కుటుంబాలు ఇక్కడి పరిశ్రమల్లో పని చేయడానికి వస్తుంటారు. ఇలా వచ్చిన వారి పిల్లలు కొత్తూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతుంటారు. కాగా కొన్ని నెలలుగా కొంతమంది విద్యార్ధులు ప్రార్థన సమయంలో కళ్లు తిరిగి పడిపోవడం, పిచ్చిగా ప్రవర్తించడం, తరగతి గదుల్లో మత్తుగా నిద్రపోవడం, చదువు మీద శ్రద్ధ లేకపోవడం ఇలా వింత వింతగా ప్రవర్తించడం మెుదలుపెట్టారు. అయితే, దీనిపై ఆరా తీస్తే ఈ ప్రవర్తనకు అసలు కారణం చాక్లెట్ అని తేలింది. హడావుడి చేయకుండా ఈ విషయం ప్రధానోపాధ్యాయుడు స్థానిక ప్రజాప్రతినిధులు, వారి ద్వారా నేరుగా డీసీపీకి సమాచారం అందించి ముఠా గుట్టు రట్టు చేశారు.

Ganjay Gang Arrest in Telangana: ఆంధ్రా ఒడిశా సరిహద్దు నుంచి రైళ్లు, బస్సులు, ట్యాంకర్లు, ప్రైవేట్వాహనాలు ఇలా అనేక మార్గాల్లో ఇది నగరాలు, పట్టణాలకు చేరుతుంది. గంజాయి తరలిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్టు చేస్తున్నా గంజాయి రవాణా(Ganja Transport in Telangana)కు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఇందుకోసం ముఠాలు విభిన్న దారులను ఎంచుకుంటున్నాయి. ప్రైవేట్బస్సులు అయితే అనుమానం రాదనుకున్న ముఠాలు వాటిని ఆసరాగా చేసుకుని గంజాయి తరలింపును చేస్తున్నాయి. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఇటీవల హైదరాబాద్నగర శివారు అబ్దుల్లాపూర్​మెట్​లో ఉదయం నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 8 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే పట్టుబడిన నిందితులంతా దాదాపు 30 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.

రూ.1.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం - ఎక్కడంటే?

"గంజాయిని సేవిస్తున్నవారే కాదు దాని వ్యాపారం చేస్తున్నవారు కూడా యువత అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్కసారి ఆ మత్తుకు అలవాటు పడ్డ యువత వారి జీవితాలు నాశనం చేసుకుని ఇందులోకి దిగుతున్నారు. దీనినుంచి బయటపడే మార్గం దొరక్క పూర్తిగా దీనిలోని చిత్తవుతున్నారు. ఇప్పుడు ఇదే కోవాలోకి విద్యార్థులు, పిల్లలు చేరుతున్నారు. వారికి తెలియకుండానే వారు ఈ మత్తుకు బానిసవుతున్నారు. వారికి అలవాటైన ఈ చాక్లెట్లు లేదా గంజాయి మళ్లీ దొరక్కపోతే వింత వింతగా ప్రవర్తించడం చేస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా బలహీన పడటం, నిద్రలేమి, సోమరితనం, అనవసరంగా ఆవేశ పడటం, భయం లేకపోవడం, ఉద్రేక పడటం, మానసిక ప్రవర్తనలో మార్పులతో పాటు మెదడు క్రియాశీలతలో మార్పులు, రోగనిరోధకశక్తి తగ్గిపోవడం, హృదయ సమస్యలు లాంటి ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి."-డాక్టర్ వై. విరజ, మానసిక వైద్య నిపుణురాలు, ఏరియా ఆసుపత్రి వనస్థలిపురం

Students Addicted to Ganjay in Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని పాఠశాలల వద్ద ఇలాంటి కార్యకలాపాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల వద్ద ఉండే కొన్ని రకాల దుకాణాలలో ఇవి లభ్యమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటితో పాటు ఇటీవల గంజాయి సేవిస్తున్న వారు ఎక్కువగా నేరాలు చేయడం కూడా పెరిగిపోయింది. మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండానే వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. గంజాయికి బానిసై సొంత తల్లిని చంపిన సంఘటనలు సన్నిహితులను హత్యలు చేసిన ఘటనలూ వెలుగు చూశాయి. దీంతో నేరాలు పెరిగిపోవడానికి గంజాయి వీరికి మరో అస్త్రంగా మారుతోంది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే రానున్న రోజుల్లో మరింత ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లల మానసిక స్థితి ఎప్పటికప్పడు అంచనా వేయాలి: గంజాయి అనే మత్తు చదువుకునే దశలోనే పిల్లలకు అలవాటు అయితే వారి భవిష్యత్​ అంధకారం అవుతుంది. ఆ తర్వాత వీరిని డీ అడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్లిన పెద్దగా ఫలితం ఉండదనిల వైద్యులు అంటున్నారు. కాబట్టి ముందుగానే తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన వారు చేస్తున్న పనులపై ఓ కంట కనిపెట్టాలని చెబుతున్నారు. లేదంటే చిన్నారి బాల్యం ఛిద్రమైపోవడం ఖాయమని వాపోతున్నారు. దీనికి బాధ్యతయుతమైన ఉపాధ్యాయులు కూడా సహకరించి పిల్లల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వారిని మంచి దారివైపు నడిపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండండి.

మత్తు దందాకు అడ్డాగా హైదరాబాద్‌ - గంజాయి గ్యాంగ్​ను పట్టుకునేందుకు పోలీసుల నయా ప్లాన్

ABOUT THE AUTHOR

...view details