Ganja Smuggling in Telangana :తులసి వనంలో గంజాయి మొక్కలు ఏపుగా పెరిగితే ఏమవుతుంది? అది మొత్తం తులసి వనాన్నే నాశనం చేస్తుంది. దానిని చూడటం తప్ప చేసేదేమీ లేదంటున్న ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తే. ఒకప్పుడు యువతను టార్గెట్‌గా చేసుకుని గంజాయిని అలవాటు చేసేవారు. కానీ, పరిస్థితులు మారాయి. ఇప్పుడు వీరి కన్ను పచ్చని విద్యాలయాలపై పడ్డాయి. అందుకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు ఘటన ఒక ఉదాహరణగా కన్పిస్తుంది.
గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయించి చిన్నపిల్లల్ని సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్న ముఠాను, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పరిశ్రమల్లోని కార్మికులకు అమ్మేందుకు తీసుకువచ్చి, వాటిని పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు. ఒడిశా నుంచి బతుకుతెరువు కోసం ఏడాది కిందట కొత్తూరు పారిశ్రామిక ప్రాంతానికి వలస వచ్చారు ముగ్గురు వ్యక్తులు. వారు ఆర్ధిక ఇబ్బందులతో సులువుగా డబ్బు సంపాదించాలని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొత్తూరు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకుగంజాయి చాక్లెట్లు (Ganja Smuggling) అమ్మాల ని నిర్ణయించుకున్నారు.
రూ.1.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం - ఎక్కడంటే?
Ganja Laced Chocolates Seized : ఒడిశా జాజాపూర్ జిల్లా మంగల్‌పూర్ నుంచి గంజాయి కలిపిన చాక్లెట్లు హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి రైళ్లలో తీసుకొచ్చే వాళ్లు. అనుమానం రాకుండా ఆ చాక్లెట్లకు చార్మినార్ గోల్డ్ మునక్క అని పేరు పెట్టారు. అలా తీసుకొచ్చిన చాక్లెట్లు వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు పరిశ్రమ బయటే రూ.9కి ఒకటి చొప్పున అమ్మేవారు. అవే చాక్లెట్లను పిల్లలకు మాత్రం మొదటగా ఉచితంగా అందించిన వారు, అలవాటైన తర్వాత రూ.20కు విక్రయించేవాళ్లు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులుదాదాపు 8 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Ganja Laced Chocolates Smuggling in Telangana :రంగారెడ్డి జిల్లా కొత్తూరు అంటేనే మినీ భారత్. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది కార్మికులు ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. ఇలా వచ్చిన వారి పిల్లలు కొత్తూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతుంటారు. కాగా కొన్ని నెలలుగా కొంతమంది విద్యార్థులు వింత వింతగా ప్రవర్తించడం మెుదలుపెట్టారు. అయితే, దీనిపై ఆరా తీస్తే ఈ ప్రవర్తనకు అసలు కారణం చాక్లెట్ అని తేలింది. హడావుడి చేయకుండా ఈ విషయం ప్రధానోపాధ్యాయుడు స్థానిక ప్రజాప్రతినిధులకు వారి ద్వారా నేరుగా డీసీపీకి సమాచారం అందించి ముఠా గుట్టు రట్టు చేశారు.
Ganja Gangs in Telangana : గంజాయిని చాక్లెట్లు, టీపొడి, భంగు, సిగరెట్లు, పొగాకు ఇలా చాలా రూపాల్లో లభించడం కొత్తేమీ కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో సార్లు వెలుగు చూశాయి. అయితే, సాధారణంగా ఎండు గంజాయి కంటే ఆయిల్‌లో ఎక్కువ మత్తు ఉంటుంది. దీనిని చాకెట్లలో మోతాదుల వారిగా కలిపి విక్రయిస్తుంటారు. దీనిని అయితే పిల్లలు, విద్యార్థులు ఎక్కవగా ఇష్టపడుతారు, తెలియకుండా తీసుకునే అవకాశం ఉంటుంది.