Ganja Gangs in Hyderabad: రాష్ట్రంలో గంజాయి వ్యసనపరులు పెరుగుతున్నారని ఇటీవల కేంద్రం వెల్లడించిన గణాంకాలతో ఏ స్థాయిలో గంజాయి, మత్తు పదార్ధాలు రాష్ట్రంలోకి వచ్చి చేరుతున్నాయో అర్థమవుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను అక్రమార్కులు అడ్డాగా మార్చుకుని మత్తు దందాను సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, భద్రాద్రి కొత్తగూడెం అటవీప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. గతంలో కేవలం కూలీలు, జేబు దొంగలకే పరిమితమైన గంజాయి ఇప్పుడు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి చెంతకు చేరుతోంది.
Ganja Supply in Hyderabad City Suburbs: ఒకప్పుడు గుడుంబాకు కేంద్రంగా ఉన్న ధూల్‌పేట్, మంగళ్‌హాట్ ప్రాంతాలు ఇప్పుడు గంజాయికి ప్రధాన కేంద్రంగా మారాయి. ఇక్కడ పోలీసుల తనిఖీలకు భయపడి నానక్‌రామ్‌గూడ, పుప్పాలగూడ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మేడ్చల్ ప్రాంతాలను మత్తు ముఠాలు స్థావరాలుగా మార్చుకున్నాయి.
కిరాణ దుకాణాలతో పాటు పాల షాపుల ముసుగులో యువతకు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారు. టీఎస్ న్యాబ్ పోలీసులు ఇటీవల నానక్‌రామ్‌గూడలోని ఓ కిరాణ దుకాణంపై దాడి చేసి భారీ ఎత్తున గంజాయి, కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఒక్క దుకాణం నుంచే సుమారు రెండు వేల మంది గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల తనిఖీలు, అరెస్టులతో స్మగర్లు కొత్త పంథాల్లో మత్తు పదార్ధాలను గమ్యానికి తరలిస్తున్నారు.
సంగారెడ్డిలో రూ.3 కోట్ల విలువ గల గంజాయి పట్టివేత
Supplying Ganja From Other States : మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దిల్లీల్లో గంజాయికి విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో మత్తుపదార్థాల రవాణాలో అనుభవం కలిగిన, జైలుకెళ్లొచ్చిన పాత నేరస్థులతో అంతరాష్ట్ర ముఠాలు చేతులు కలుపుతున్నాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి సరుకు హైదరాబాద్ దాటిస్తే లారీ, డీసీఎం, కార్లకు రోజుకు 50 వేల నుంచి 60 వేలు కిరాయి, డ్రైవర్‌కు 20 వేలు, ఏజెంట్లకు 30 వేలు ఇస్తామని మత్తు ముఠాలు ఆశచూపుతున్నాయి. అక్కడ కిలో గంజాయి పది వేల నుంచి 15 వేలకు కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కిలో 50 నుంచి 60 వేలకు విక్రయిస్తున్నారు.