Gangula kamalakar on BC degree gurukulas : రాష్ట్రంలో మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కళాశాలలు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల, నారాయణ్‌పేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొత్త కళాశాలలు ప్రారంభం కానున్నాయి.
దీంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ బీసీ గురుకుల డిగ్రీ కళాశాల అందుబాటులోకి రానుంది. కొత్త కళాశాలలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. వెనకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. తాజాగా ఏర్పాటయ్యే కళాశాలలతో కేవలం బీసీ డిగ్రీ గురుకులాల్లోనే 31,680 మందికి ప్రపంచస్థాయి విద్య అందుతుందని మంత్రి తెలిపారు.
శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థికసాయం.. బీసీ వృత్తులకు లక్ష రూపాయల ఆర్థికసాయం కోసం 5,28,862 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి గంగుల చెప్పారు. అందులో బీసీ-ఏ కేటగిరీ నుంచి 2,66,001, బీసీ-బీ నుంచి 1,85,136, బీసీ-డీ నుంచి 65,310 దరఖాస్తులతో పాటు ఎంబీసీలు 12,415 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైందని తెలిపారు. క్రమ సంఖ్య ప్రకారం ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రతి నెలా 5వ తేదీ వరకు పరిశీలన పూర్తయిన వారికి అదే నెల 15వ తేదీన స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థికసాయం అందిస్తామని మంత్రి గంగుల కమలాకర్వివరించారు.