రాష్ట్రంలోని చెరువుల్లో చేపలు పట్టే హక్కు ముదిరాజులకే ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పడం ఎంతవరకు సమంజసమని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లయ్య ప్రశ్నించారు. చెరువులు, కుంటల్లోని చేపలపై గంగపుత్రులకే అధికారం ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. తలసాని వ్యాఖ్యలను ఖండిస్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో రాష్ట్ర గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మంత్రి తలసానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
'మా సత్తా చూపిస్తాం '
రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 30వ తేదీలోగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని... లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే ఉప ఎన్నికల్లో గంగపుత్రుల సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు.