గణేశ్ ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈసారి హస్సేన్ సాగర్ వద్ద గంగాహారతి ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వేదపండితులతో చర్చించిన అనంతరం గంగాహారతి తేదీ, సమయాన్ని ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో జంటనగరాల ప్రజాప్రతినిధులు, పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవసమితి ప్రతినిధులతో పాటు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. జంట నగరాల్లో 54 వేలకు పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని... ఉత్సవాలు సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
26 చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు
ఖైరతాబాద్ గణపతి వద్ద తొమ్మిది రోజుల పాటు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారని... హుస్సేన్ సాగర్ సహా 26 చెరువుల వద్ద నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవసమితులతో చర్చించి నిమజ్జనానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.