Ganesh Nimajjanam Hyderabad 2023 :భాగ్యనగరంలో వినాయక చవితి వచ్చిదంటే ఆ సందడే వేరు! గల్లీగల్లీలో గణనాథులు కొలువుదీరుతారు. ఇలా నవరాత్రులు పూజలందుకున్న లంబోదరులు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. నిమజ్జనోత్సవానికి హైదరాబాద్‌తో సహా పలు ప్రధాన కేంద్రాల వద్ద ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకే రోజు రావడం దైవేచ్ఛ అన్న సీఎం.. ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగలు చేసుకుంటూ తెలంగాణ గంగా జమున తెహజీబ్‌ను మరోసారి ప్రపంచానికి చాటాలని ప్రజల్ని కోరారు. నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.
"రాష్ట్ర ప్రభుత్వం నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం రాకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. గణేశుడి శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తాం. అన్ని ప్రాంతాల్లో 349 గ్రిడ్లు, గజ ఈతగాళ్లలను ఏర్పాటు చేశాం."- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
Ganesh Immersion Hyderabad 2023: జీహెచ్ఎంసీ పరిధిలో 90 వేలకుపైగా గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లోనే 30 వేలకు పైగా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ట్యాంక్‌బండ్‌పై 14, ఎన్టీఆర్ మార్గ్‌లో 10, పీవీ మార్గ్‌లో 10 క్రేన్లను సిద్ధం చేశారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు 33 చెరువులు, 72 కొలనులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా జీహెచ్ఎంసీ పరిధిలో 10 వేల మంది శానిటేషన్ సిబ్బంది పనిచేయనున్నారు.
Hyderabad Ganesh Immersion 2023 : లక్షలాది సంఖ్యలో భక్తులు గణనాథుల శోభయాత్రను చూడనుండటంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కలిపి 40 వేల మంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అధిక సంఖ్యలో విగ్రహాలు ఉండటంతో.. ప్రత్యేక బలగాలతో పాటు టీఎస్ఎస్పీ, టాస్క్‌ఫోర్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఇప్పటికే ప్రాంతాలవారీగా డీసీపీలను బాధ్యులుగా నియమించారు.