కోనేరుల్లో రూ.కోట్లు.. నిమజ్జనానికి పాట్లు.. - గణపతి నిమజ్జనాల పాట్లు
గణపతి నిమజ్జనాల కోసం గతంలో ఏర్పాటుచేసిన నీటివనరులు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. నిమజ్జనాల వేళ యువత చెరువుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు జలాన్ని కలుషితం చేస్తున్నాయంటూ రూ.30 కోట్లతో నిర్మించిన 23 కోనేర్లు ప్రస్తుతం మురికి కుంటల్లా మారాయి. సంజీవయ్య పార్కు దగ్గరున్న కోనేరు మొదలు ప్రగతినగర్, కాప్రా, ఇతరత్రా చెరువుల్లోని నిర్మాణాల వరకు చెత్తాచెదారంతో నిండిపోయాయి. వ్యర్థాలు కుళ్లి ఆ పరిసరాల నుంచి దుర్వాసన వస్తోంది.
కోనేరుల్లో రూ.కోట్లు.. నిమజ్జనానికి పాట్లు..
By
Published : Aug 27, 2020, 9:51 AM IST
గ్రేటర్ పరిధిలోని సుమారు 50 చెరువుల్లో చుట్టపక్కల ప్రజలు ఏటా గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. తద్వారా జలవనరులు కాలుష్యమవుతున్నాయని అధికారులు భావించారు. బెంగళూరులో అవలంబిస్తున్న విధానాలను చూసి మూడేళ్ల క్రితం 23 కోనేరుల నిర్మాణ పనులు చేపట్టారు. కొన్ని 2018లో అందుబాటులోకి రాగా, గతేడాది మిగిలినవి ప్రారంభించారు. వాటిని వినాయక చవితి, బతుకమ్మ, దసరా ఉత్సవాల సమయంలో ఉపయోగించారు. పండగలకు ముందే వ్యర్థాలను తొలగించి శుభ్రమైన నీటితో నింపేవారు. చుట్టూ పూలు, విద్యుద్దీపాలతో అలంకరించేవారు. ఇప్పుడు ఏర్పాట్లేమీ లేక మురికికూపాల్లా మారాయి.
గ్రేటర్‌లో పరిస్థితి
చిన్నా పెద్ద చెరువులు సుమారు - 185
నిర్మించిన కోనేరులు - 23
ఒక్కో కోనేరుకు నిర్మాణ వ్యయం: రూ.70 లక్షల నుంచి రూ.1.50 కోట్లు
ఊసే మరిచిన జీహెచ్‌ఎంసీ..
కొవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా నగరవాసులు చిన్నపాటి విగ్రహాలతో ఇళ్లలోనే పూజలు చేశారు. కొందరు అక్కడక్కడా మండపాల్లో నెలకొల్పారు. అయితే నిమజ్జన ఏర్పాట్ల ఊసే జీహెచ్‌ఎంసీ మరిచిపోయింది. చివరకు చిన్న విగ్రహాల కోసమే నిర్మించిన కోనేర్లలోనూ వ్యర్థాలను తొలగించి శుభ్రమైన నీటితో నింపాలన్న ఆలోచన చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
కోనేరులు ఎక్కడెక్కడ
కాప్రా-ఊరచెరువు, కూకట్‌పల్లి-అంభీర్, రంగధాముని, గంగారం పెద్ద చెరువు, జీడిమెట్ల- వెన్నెలచెరువు, రాయదుర్గం-మల్కచెరువు, నల్లగండ్ల, మన్సూరాబాద్- పెద్ద చెరువు, హుస్సేన్‌సాగర్- సంజీవయ్య ట్యాంకు, నెక్నాంపూర్-పెద్దచెరువు, సూరారం- లింగంచెరువు, మూసాపేట- ముళ్లకత్వ చెరువు వద్ద ఏర్పాటుచేశారు. ఇవికాక చర్లపల్లి ట్యాంకు, నాగోల్ చెరువు, అల్వాల్ కొత్త చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, రాజేంద్రనగర్ పత్తికుంట, హస్మత్‌పేట బోయిన్ చెరువు, గుర్నాథం, లింగంపల్లిలో గోపి చెరువు తదితరాలున్నాయి.