రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. భక్తుల ఆటపాటల నడుమ నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిమజ్జన కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. వాహనాలు అందంగా అలంకరించిన భక్తులు.. జోరు వర్షంలోనూ బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికారు. బంధం చెరువు, పద్మాక్షి గుండం, చిన వడ్డేపల్లి, ఉర్సుగుట్ట కోట, హసన్‌పర్తి చెరువులతో పాటు.. 27 చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాల్లోనూ నృత్యాలు, కోలాటాల మధ్య నిమజ్జనం సందడిగా సాగింది. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నృత్యాలతో అలరించారు.
కరీంనగర్లో టవర్ సర్కిల్ వద్ద వినాయకుడికి మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి మేయర్ సునీల్‌రావు నృత్యం చేశారు. కరీంనగర్‌లోని భారీ విగ్రహాలను మానకొండూరు చెరువులో నిమజ్జనం చేశారు. సిరిసిల్ల, జగిత్యాలలో యువతి, యువకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.