తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganesh Chaturthi 2023 Telangana : జై బోలో మట్టి గణపతికీ.. మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం - ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌

Ganesh Chaturthi 2023 Telangana : వినాయక చవితి పండుగ వచ్చేస్తోంది. మరో 7 రోజుల్లో నవరాత్రుల సంబురాలు ప్రారంభం కానున్నాయి. విగ్రహాల విక్రయాలు జరిపే ఎల్బీనగర్, కూకట్​పల్లి, మేడ్చల్, వనస్థలిపురం, ధూల్​పేట్, నాగోల్​ తదితర ప్రాంతాల్లో అప్పుడే సందడి వాతావరణం కనిపిస్తోంది. మట్టి విగ్రహం కొనుగోలు చేయాలా.. పీవోపీ విగ్రహం కొనుగోలు చేయాలా.. అని వినాయక మండపాల నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారు. మట్టి విగ్రహాల్లో దృఢత్వం ఉండదని.. వాటి నిమజ్జనంతో జలాశయాలు, చెరువుల్లో పూడిక పెరుగుతుందని వారు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని పర్యావరణ నిపుణులు అంటున్నారు. పీవోపీతో జలాశయాల్లో జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

Ganesh Chaturthi 2023 Telangana
Ganesh Chaturthi 2023

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2023, 11:38 AM IST

Ganesh Chaturthi 2023 Telangana :ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను.. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక కృత్రిమ కొలనుల్లోనే నిమజ్జనం(High Court on POP Ganesh Idols) చేయాలని పేర్కొంది. గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని తెలిపింది. పీవోపీ విగ్రహాల(POP Ganesh Idols)నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో చేయవద్దని.. ప్రత్యేక కొలనుల్లోనే చేయాలన్న గత ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్ వద్ద కెమెరాలతో నిఘా పెట్టాలని.. న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. అయితే అసలు పీవోపీతో నష్టాలేంటి.. మట్టి గణపతుల విగ్రహాలతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

పీవోపీతో నష్టమిదే.. :అయితే గతేడాది గ్రేటర్‌ హైదరాబాద్(​Greater Hyderabad Municipal Corporation) పరిధిలో పీవోపీ విగ్రహాలతో 80 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తయ్యాయి. పీవోపీ, విగ్రహాలపై వేసిన రంగులు, రసాయనాలు నీటిలో కరగడంతో హానికర లోహాల పరిమాణం పెరుగుతోందని, ఇది జలచరాలకు ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌, బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ శాతం పడిపోవడంతో జలచరాలకు ఊపిరాడటం లేదని నివేదికల ద్వారా స్పష్టమవుతోంది.

Clay Ganesh Idols Telangana 2023 :చెరువుల్లో లభించే మట్టి, బంకమట్టితో చేసే విగ్రహాలను పూజించడంలో కొంత శాస్త్రీయత ఉందని పెద్దలు చెబుతున్నారు. వర్షాకాలానికి ముందు జలాశయాల్లో నీరు లేకపోవడంతో పూడిక తీసేవారు. అలాగే ఆ మట్టితోనే గణేశుని విగ్రహాలు తయారుచేసేవారు. వర్షాకాలంలో జలాశయాలు నిండిన తర్వాత.. ఆ విగ్రహాలను అందులో నిమజ్జనం చేయడంతో ఆ మట్టి అడుగు భాగానికి చేరి నీళ్లు త్వరగా ఇంకకుండా చేస్తుందని చెబుతున్నారు.

Badhyatha Foundation Ganesh Festival 2023 : 'పండుగ పైసలు పల్లెకిద్దాం వారికి తోడుగా ఉందాం'

'మేము గత 15 సంవత్సరాలుగా మట్టి విగ్రహాలు తయారుచేస్తున్నాం. మా వద్ద 70 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ముందుగా చెరువు మట్టిని తీసుకొచ్చి నానబెట్టి, ఫిల్టర్‌ చేసి పొడిలా మారుస్తాము. కుంకుమ తరహాలో వచ్చేలా జల్లెడ, యంత్రాలు వాడుతాం. దృఢత్వం కోసం జనపనార ఉపయోగిస్తాం. మరింత గట్టిదనం కోసం కొంచెం పేపర్‌ పౌడర్‌ కలుపుతాం. దీంతో బరువు తక్కువ, దృఢత్వం ఎక్కువగా ఉంటుంది.' -స్వామి, మట్టి విగ్రహాల తయారీదారు

మట్టి గణేశ్‌పై అవగాహన ప్రచారంలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి.. ప్రతి పారిశ్రామికవాడలో మట్టి చేసిన గణేశ్​ విగ్రహాల పంపిణీ చేపడుతోంది. అందేకాకుండా పీవోపీకి బదులుగా మట్టి ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ.. ప్రతి జిల్లా పరిధిలో 1.2 లక్షలకు పైగా విగ్రహాలు పంపిణీ చేయనుంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ 3.8 లక్షలు, హెచ్‌ఎండీఏ వారు లక్ష విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

'మట్టి విగ్రహాలతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుంది. మట్టితో చేసిన విగ్రహాలను పూజించి.. మళ్లీ నీటిలో వాటిని నిమజ్జనం చేయడంతో చాలా మందికి ఉపాధి లభిస్తుంది. గతంలో చెరువులు కులవృత్తులకు మాత్రమే ఆదరువుగా ఉండేవి. సీజన్‌ను బట్టి చెరువుల నుంచి మట్టి, చేపలు ఇతరత్రా వనరులను పొందేవారు. మట్టి విగ్రహాల తయారీతో పూడిక తీసేవారికి, విగ్రహాలు తయారుచేసే వారికి, వ్యాపారులకు ఉపాధి కల్పన లభిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​(పీవోపీ)తో జల కాలుష్యం పెరుగుతుంది.' - దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త

MP Santhosh Kumar Distributed Seed Ganesh Idols : విత్తన గణపతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి: ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్

High Court on POP Ganesh Idols Immersion : పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనంపై గతేడాది ఉత్తర్వులు కొనసాగుతాయి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details