Ganesh Chathurthi 2023 Celebrations :రాష్ట్రంలో వినాయకచవితి ఉత్సవాలు(Ganesh Chaturthi) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గణేశ్ చతుర్థి పండగను ఘనంగా నిర్వహించేందుకు.. భాగ్యనగర వాసులు పూనుకొన్నారు. నవరాత్రి మహోత్సవాలకు నేటి నుంచి గణనాథుడు ముస్తాబవుతుండటంతో.. పూజా సామగ్రి కొనుగోళ్లతో నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ గుడిమల్కాపూర్ మార్కెట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించడంతో.. ధరలు ఎక్కువగా ఉన్నా సరే మట్టి విగ్రహాలని పూజించడానికే ప్రజలు సుముఖత చూపుతున్నారు. మరోవైపు ధరలు బాగా పడిపోయాయని.. వ్యాపారస్తులు వాపోతున్నారు. కొందరు రాజకీయనాయకులు.. తమ పార్టీకి ఉన్న విఘ్నాలు తొలగాలని లంబోధరుడిని స్మరిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణనాథులను ప్రతిష్ఠించవద్దని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో మట్టి విగ్రహాలకు గిరాకీ పెరిగింది.
Vinayaka Chavithi 2023 in Telangana :ఎంజే మార్కెట్, సుల్తాన్‌బజార్ తదితర ప్రాంతాలు మట్టి విగ్రహాల కొనుగోలు దారులతో కళకళలాడుతున్నాయి. సికింద్రాబాద్‌లోని గణేశ్ దేవాలయంలో.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ యువజన నాయకులు.. కొప్పుల హర్దీప్రెడ్డి ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
వినాయక చవితిని పురస్కరించుకొని వరంగల్ జిల్లాలో గణపతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఖాజీపేటలోని శ్వేతార్కగణపతి ఆలయంలో భక్తులు బొజ్జ గణపయ్యకు విశేష పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భక్తులు ఏకదంతునికి నైవేథ్యాలు, కుడుములు, ఉండ్రాళ్లు సమర్పించారు. సంగారెడ్డిలోని రుద్రారంలో వెలసిన స్వయంభూ విజ్ఞాధిపతి దేవస్థానానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.