Gandhi Jayanti 2023 Telangana: మహాత్మా గాంధీ 154వ జయంతి(Gandhi Jayanti ) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మహాత్మునికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించి అంజలి ఘటించారు. గాంధీ దేశానికి అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. తమ ప్రభుత్వం గాంధీజీ సిద్దాంతాలకు అనుగుణంగానే పరిపాలిస్తోందని తెలిపారు.గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతిరూపాలని తెలిపారు.
Gandhi Jayanti 2023 Celebrations in Telangana : శాసనసభా ప్రాంగణంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్, డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్‌లు గాంధీ విగ్రహానికినివాళులర్పించారు. మహాత్ముడు చూపిన మార్గంలో నడుస్తూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. జాతికి మహాత్మడు చేసిన కృషి ఎనలేనిదంటూ మంత్రి కేటీఆర్(Minister KTR) గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసిన మంత్రి.. జాతిపిత ఆదర్శంగానే రాష్ట్రంలో పాలన సాగుతుందన్నారు.
'మహాత్ముని శాంతి సందేశం నవ శకానికి నాంది'
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మహాత్ముడికి పూలమాల వేసి అంజలి ఘటించారు. హనుమకొండలోని పబ్లిక్‌గార్డెన్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మహాత్ముడి ఘనతను కొనియాడారు. అనంతరం ఘన నివాళులు అర్పించారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.