గాంధీ ఆస్పత్రిలో ఒక పేషెంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి కొత్త యాంటీ వైరల్ డ్రగ్స్ ప్రయోగిస్తున్నామని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు హైకోర్టుకు తెలిపారు. సానుకూల ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాలు ఇటీవలే వచ్చాయని, వాటి ప్రకారం ర్యాపిడ్ యాంటీజెంట్ పరీక్షలు చేసేందుకు ఆలోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. లక్షణాలు లేని వారికి కరోనా పరీక్షలు అవసరం లేదని అన్నారు. వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం కూడా చాలా తక్కువని ఆయన వివరించారు.
ఆస్పత్రిలోనే వసతి
గాంధీ ఆస్పత్రిలో 12 మంది వైద్యులు కరోనా బారిన పడ్డారని వివరించారు. వైద్య సిబ్బందికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సూపరిండెంట్ నుంచి వార్డుబాయ్ వరకు ఒకే నాణ్యతతో కూడిన కిట్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో వృద్ధులు ఉన్న వైద్య సిబ్బందికి ఆస్పత్రిలోనే వసతి కల్పించినట్లు వివరించారు. సుమారు 1200 వైద్య సిబ్బందిలో సగం మందిని మూడు షిఫ్టుల్లో పని చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు.