కొవిడ్ మూడో దశ తీవ్రంగా ఉంటుందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. వేల మంది బాధితులను పరిశీలించిన మీ అభిప్రాయమేంటి?
రెండు దశల్లో రాష్ట్రంలో లక్షల మంది ప్రభావితులయ్యారు. కొందరిలో సాధారణంగా, మరికొందరిలో తీవ్ర ప్రభావం చూపింది. కోలుకున్న చాలా మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. ఇప్పటికే దాదాపు కోటిమందికి దగ్గరగా టీకాలు పొందారు. వారిలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయి. ఆహారం, జాగ్రత్తల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఒకవేళ మూడో దశ వచ్చినా.. అది రెండో దశంత తీవ్రంగా ఉండే అవకాశం లేదని భావిస్తున్నాను.
మూడో దశలో పిల్లల్లో వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది కదా..?
తొలి దశలో గాంధీలో 400 మంది చిన్నారులు చికిత్స పొందగా, రెండో దశలో 750 మంది చికిత్స పొందారు. వీరిలో 99 శాతం మంది పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారు. చిన్నారుల శరీరం సమర్థంగా ఎదుర్కోవడం వల్లే అంతమంది కోలుకున్నారు. మూడోదశ అంటూ వస్తే అన్ని వయసుల వారికీ సోకుతుంది. పిల్లలే ఎక్కువగా దాని బారినపడతారన్న వాదన సరికాదు. పిల్లలకు ప్రస్తుతం టీకాలు ఇవ్వడంలేదు. అందువల్ల కరోనా సోకే వారి సంఖ్య రెండో దశలాగే ఉండొచ్చు గానీ లక్షలాది మందికి సోకుతుందన్న వార్తలు ఊహాజనితమే. ఆందోళన విడిచి జాగ్రత్తగా ఉంటూ ప్రతి ఒక్కరూ బలవర్ధక ఆహారాన్ని తిని ఆరోగ్యంగా మారితే చాలు.