మాతృత్వం.. ప్రతి మహిళకూ వరం. గర్భం దాల్చింది మొదలు శిశువు భూమ్మీద పడే వరకు ఆ మహిళ ఎన్నో కలలు కంటుంది... ప్రసవించే వరకు... అనంతరం పసిబిడ్డ లాలన వరకు ఆమె తల్లితండ్రులు, భర్త, అత్తమామలు ఎంతో అపురూపంగా చూసుకుంటారు... ముఖ్యంగా మహిళలకు పుట్టింటి ప్రేమలోని మాధుర్యం ప్రసవ సమయంలోనే అధికంగా అనుభవంలోకి వస్తుంది. కానీ కరోనా అలాంటి ఆశలన్నిటినీ తుడిచిపెట్టేసింది. బిడ్డ పుట్టగానే ప్రేమగా తల నిమరడానికి అక్కడ భర్త ఉండడు.. ప్రసవానంతర సేవలందించడానికి తల్లి, అత్త... ఇలా కుటుంబంలోని మహిళలెవరూ కానరారు. గర్భిణులు కాన్పు సమయంలో ఆశించే అనుబంధాలన్నింటినీ కొవిడ్ దూరం చేసింది.
కరోనా బారినపడిన గర్భిణులకు ప్రసవం, అనంతర సేవలతో పాటు శిశువు ఆలనా పాలనా బాధ్యతలను చూసుకుంటున్నది వైద్యసిబ్బందే. భర్తలా ఓదార్పునిచ్చినా.. తండ్రిలా లాలించినా.. తల్లిలా పాలుపట్టినా.. ఆ ఆసుపత్రిలో తల్లీబిడ్డలకు అన్నీ వైద్యులు, నర్సులు, ఆయమ్మలే. రాష్ట్రంలో కొవిడ్ కేంద్రంగా సేవలందిస్తున్న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో నిత్యం జరుగుతున్నదిదే. కరోనా బాధిత మాతాశిశువులను సురక్షితంగా ఇళ్లకు పంపించడంలో ఈ ఆసుపత్రి విశేష సేవలందిస్తోంది.
50 శాతం కాన్పు కోతలు
రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన మార్చి నుంచి కొవిడ్ బాధితులకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలున్న గర్భిణులకు కూడా ఇక్కడే కాన్పు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కరోనా లక్షణాలున్న గర్భిణులనైనా, ప్రసవానంతరం కొవిడ్ అని నిర్ధరించినా.. తల్లీబిడ్డలను గాంధీకే పంపుతున్నారు. ఇక్కడ మార్చిలో ఇలాంటి మహిళల ప్రసవాలు సుమారు 60 వరకూ కాగా, క్రమేణా కరోనా ప్రసవాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రోజుకు 7-10 చొప్పున కొవిడ్ కాన్పులు చేస్తున్నారు. వీటిలో సహజ ప్రసవాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు గాంధీ వైద్యులు చెబుతున్నారు. తొలికాన్పు సిజేరియన్ అయినవారు, అధిక రక్తపోటు, మధుమేహం, మూర్ఛ, తీవ్ర రక్తహీనత తదితర ముప్పు పొంచి ఉన్న వారికి మాత్రం శస్త్రచికిత్స చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కొవిడ్ ప్రసవాల్లో 50 శాతం వరకూ సహజ కాన్పులు, మరో 50 శాతం వరకూ సిజేరియన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అహర్నిశలు కంటికి రెప్పలా..
* సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో పీజీ వైద్యులదే కొవిడ్ ప్రసవాల్లో కీలక పాత్ర. చికిత్సలో నిత్య పర్యవేక్షణ వీరిదే.
* ప్రసవానికి ముందు.. తర్వాత వార్డుల్లో ప్రధాన సేవలందించేది నర్సులు. తల్లీబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో వీరిది ఎనలేని పాత్ర.
* తల్లీబిడ్డలిద్దరికీ పాజిటివ్ వస్తే, ఇద్దరినీ ఒకే వార్డులో కనీసం 10 అడుగుల దూరంలో ఉంచుతున్నారు.
* కొవిడ్ బారినపడిన తల్లుల్లో కొందరు తమ బిడ్డ ఏడుస్తున్నా పాలు పట్టడానికి నిరాకరిస్తున్నారు. శిశువుకు కరోనా సోకుతుందేమోనన్న భయమే దీనికి కారణం. ఇలాంటి అపోహలను, భయాందోళనలను తొలగించడంలో వైద్యసిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు.
* తల్లి పాజిటివ్‌గా ఉండి.. శిశువుకు నెగెటివ్ అని తేలితే.. ఆ శిశువును ‘న్యూబోర్న్ ఐసీయూ’లో ఉంచుతున్నారు. వార్డులో ఉన్న తల్లి నుంచి పాలను గిన్నెలో పిండి.. శిశువుకు ఆయమ్మలే తాగిస్తున్నారు.