PM Modi speech at G20 Agricultural Meet In Hyderabad :హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో జీ-20 సభ్య దేశాల వ్యవసాయశాఖ మంత్రుల సదస్సు కొనసాగుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సదస్సుకు కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రులు కైలాష్‌చౌదరి, శోభ కరంద్లాజే, పలు దేశాల వ్యవసాయ మంత్రులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణహితం దృష్ట్యా ఆహార భద్రత, లాభసాటి సుస్థిర వ్యవసాయం, రైతు ఆదాయాలు పెంపు, జీ-20 దేశాలు వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యతలు, పరిశోధనలు వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చ సాగుతోంది.
G20 Agriculture Ministers Meeting in Hyderabad : సాగురంగంలో సవాళ్లను అధిగమించి.... ప్రపంచంలో ఆహార భద్రత లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని దేశాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జీ-20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.... వాతావరణ మార్పులతో వ్యవసాయ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని చెప్పారు. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ సాంకేతికతల ద్వారా రైతులు సాధికారత సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.
'ఎంతో కీలకమైన వ్యవసాయరంగంపై భారతదేశం ప్రత్యేక దృష్టి సారించింది. 'మూలాల్లోకి వెళదాం... భవిష్యత్తులోకి అడుగేద్దాం' అనే నినాదంతో భారతదేశం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం 250 కోట్ల మంది ప్రజలకు జీవనాధారంగా ఉంది. ప్రపంచ దేశాల జీడీపీలో 30% భాగస్వామ్యం, 60 శాతానికి పైచిలుకు ఉద్యోగాలను సాగు రంగం కల్పిస్తోంది. నేడు వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం, కరోనా మహమ్మారి కారణంగా సరఫరా గొలుసు అంతరాయం మరింత పెరిగింది. వాతావరణంలో మార్పు అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి పెనుసవాల్‌గా మారింది.' - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి