G20 agriculture ministers' Summit in Hyderabad Today: హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మకా జీ20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరగనున్న ఈ సమావేశాల్లో జీ20 సభ్య దేశాల వ్యవసాయశాఖ మంత్రులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కీలక సమావేశాలను ఇవాళ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రారంభించనున్నారు. జీ20లో భాగంగా ఇప్పటి వరకు వ్యవసాయానికి సంబంధించి మూడు జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు మొదటి సదస్సు ఇందౌర్, రెండోది చండీగఢ్, మూడోది వారణాసిలో జరిగింది.
నగరంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వ్యవసాయ మంత్రుల స్థాయి సమావేశాల్లో జీ20 19 సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటారు. వ్యవసాయం, స్థిరమైన జీవవైవిధ్యం, వాతావరణ పరిష్కారాలపై ఉన్నత స్థాయి మంత్రుల చర్చలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ఆహార భద్రత, పోషకాహార భద్రత, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం కాపాడుకోవడం ధ్యేయంగా ఈ జీ20 సమావేశాలుజరగనున్నాయి. ప్రపంచంలో... ప్రత్యేకించి భారత్‌లో కరోనా నేపథ్యంలో అనేక రకాల సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశాలకు భాగ్యనగరం వేదిక కావడం అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
తొలి రోజు జీ20 వ్యవసాయ మంత్రుల సమావేశం ప్రారంభోత్సవం అనంతరం వ్యవసాయ ప్రతినిధుల సమావేశం - ఏడీఎం ఉంటుంది. ద్వితీయార్ధంలో వ్యవసాయ - వ్యాపారం ఎలా లాభదాయకంగా తీర్చిదిద్దాలి...? ప్రజలు, భూగోళం పరిరక్షణ, వ్యసాయంలో డిజిటల్ టెక్నాలజీ అనుసంధానం చేయడం వంటి అంశాలపై రెండు కార్యక్రమాలు సాగుతాయి. ఇందులో అగ్రశ్రేణి భారతీయ వ్యవసాయ - ఆధారిత కంపెనీలు పాల్గొంటాయి. వ్యవసాయ - వ్యాపార కంపెనీల ప్రోత్సాహంలో భాగంగా ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పాల్గొంటాయని కేంద్రం వెల్లడించింది.
G20 agriculture ministers Meeting Today : జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు భారతదేశం అధ్యక్షతన జరుగుతున్నాయి. 2022లో ఇండోనేషియా ఈ సమావేశాలకు అధ్యక్షత వహించింది. ఇప్పుడు మనదేశం ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తోంది. 2024లో బ్రెజిల్ ఈ సమావేశాలకు అధ్యక్షత చేపట్టనుంది. ఈ సమావేశాలు చాలా కీలకమైనవి. ప్రపంచానికి సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశాలు దిశానిర్దేశం చేస్తాయి. భారత ప్రభుత్వం, ప్రజలు జీ20 దేశాల సమావేశాలకు ఆతిథ్యం ఇస్తుండటం ఓ ప్రత్యేకత. జీ20 సమావేశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో... ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ సమావేశాలపై ఆసక్తి చూపించడంతోపాటు అనుసరిస్తున్నాయి.
ఇవీ చదవండి: