పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలతో పల్లెలన్నీ పచ్చదనం... పారిశుద్ధ్యంతో అభివృద్ధి చెందుతున్నాయి. వ్యక్తులు ఎవరు మరణించినా అంతిమ సంస్కారాలు గౌరవంగా ఉండాలని ప్రభుత్వం ప్రతీ గ్రామంలో వైకుంఠాధామాలను ఏర్పాటు చేసింది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఓ మండల పంచాయతీ అధికారి అడుగు ముందుకేసి పశుపక్ష్యాదులకు సైతం గ్రామాలలో అంతిమ సంస్కారాలు చేసేలా శ్మశానవాటికలను ఏర్పాటు చేశారు. ఈ వివరాల గురించి తెలుసుకోవాలంటే వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలానికి వెళ్లాల్సిందే.
ప్రజలకు ఇబ్బంది లేకుండా..
ఏ గ్రామంలోనైనా పశుపక్ష్యాదులు మరణిస్తే గ్రామ శివారులలో పడేస్తారు. దాంతో ఆ కలేబరం దుర్గందం వెదజల్లుతూ ఉంటుంది. దానివల్ల ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. 2020 డిసెంబర్లో ఒక వానరం చనిపోగా... నల్లబెల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతే కాకుండా ఇటీవల ఓ శునకం సైతం మరణించడంతో... దాని యజమాని శునకానికి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇది గమనించిన మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాశ్‌కు మెరుపులాంటి ఆలోచన తట్టింది.