Railway Budget 2022- 23 under SCR: దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు రైల్వే బడ్జెట్‌లో ఈ ఆర్థిక సంవత్సరం అధిక ప్రాధాన్యమిచ్చారు. గత బడ్జెట్‌లో కంటే ఈసారి సుమారు 30 శాతం అధిక నిధులు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజీవ్ కిషోర్ తెలిపారు. రైల్ నిలయం నుంచి దృశ్యమాధ్యమం ద్వారా బడ్జెట్ వివరాలను జీఎం వెల్లడించారు. 2022-23 సంవత్సరానికి నూతన రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ ట్రాక్ వసతుల కోసం రూ. 9,125 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 2021- 22 ఏడాదికి రూ.7,049 కోట్లు కేటాయింపులు చేశారని.. గతేడాదితో పోల్చితే ఇది 30 శాతం అధికమని తెలిపారు. నూతన రైల్వే లైన్లకు క్యాపిటల్ డిపాజిట్ అదనపు బడ్జెట్ వనరులకు రూ.2,817 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. తెలంగాణకు రూ.3,048 కోట్లు, ఏపీకి రూ.7,032 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
కొత్త లైన్లు
- నడికుడి- శ్రీ కాళహస్తి కొత్త రైల్వే ప్రాజెక్టుకు రూ. 1,501 కోట్లు
- కోటిపల్లి- నర్సాపూర్ ప్రాజెక్టుకు రూ. 358 కోట్లు
- మునీరాబాద్- మహబూబ్‌నగర్ ప్రాజెక్టుకు రూ. 289 కోట్లు
- కడప- బెంగళూరు ప్రాజెక్టుకు రూ. 289 కోట్లు
- భద్రాచలం- సత్తుపల్లి మార్గంలో రూ. 163 కోట్లు
- మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైనుకు రూ. 160 కోట్లు
- అక్కన్నపేట- మెదక్ ప్రాజెక్టుకు రూ. 41 కోట్లు కేటాయించినట్లు జీఎం వివరించారు.
డబ్లింగ్, విద్యుదీకరణ పనుల కోసం
నర్సాపూర్- నిడదవోలు మార్గంలో డబ్లింగ్, విద్యుదీకరణ పనుల కోసం రైల్వే బడ్జెట్‌లో రూ. 1,681 కోట్లు కేటాయించారు. విజయవాడ- గూడూరు మధ్య మూడో లైను ప్రాజెక్టు కోసం రూ. 1000 కోట్లు, గుంటూరు- గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టు కోసం రూ. 803 కోట్లు, కాజీపేట- విజయవాడ మధ్య మూడో లైను ప్రాజెక్టుకు రూ. 592.5 కోట్లు, కాజీపేట- బల్లార్ష మూడో లైను ప్రాజెక్టు కోసం రూ. 550.43 కోట్లు కేటాయించినట్లు జీఎం తెలిపారు. గుత్తి- ధర్మవరం డబ్లింగ్ ప్రాజెక్టు కోసం రూ. 100 కోట్లు, అకోలా- డోన్ డబ్లింగ్ ప్రాజెక్టు కోసం రూ. 5 కోట్లు కేటాయించినట్లు వివరించారు. మన్మాడ్- ముద్‌ఖేడ్- డోన్ సెక్షన్ మధ్య విద్యుద్దీకరణ కోసం రూ. 229 కోట్లు, పింపలకుటి- ముద్‌ఖేడ్- పర్భనీ సెక్షన్ మధ్య విద్యుద్దీకరణ కోసం రూ. 129కోట్లు, లింగంపేట- జగిత్యాల- నిజామాబాద్ మధ్య విద్యుద్దీకరణ కోసం రూ. 39 కోట్లు కేటాయించారు.