Union Budget Funds allocated to Telangana Institutions: దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 1గంటా 26నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం సాగింది. ఈ బడ్జెట్ యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఆశాదీపం అని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణలోని పలు సంస్థలకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. సింగరేణికి రూ. 1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌కు (ఈఏపీ కింద) రూ. 300 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు కేటాయించారు. మొత్తంగా చూసుకుంటే కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.
తెలంగాణ సంస్థలకు కేటాయింపులు..
* సింగరేణి - రూ.1,650 కోట్లు
* ఐఐటీ హైదరాబాద్ - 300 కోట్లు
* మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు - రూ. 1,473 కోట్లు
తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులు..
* రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు - రూ. 37 కోట్లు
* మంగళగిరి, బిబినగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు - రూ. 6,835 కోట్లు
* సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియంలకు - రూ. 357 కోట్లు
ఏపీ సంస్థలకు కేటాయింపులు..
* ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ - రూ. 47 కోట్లు
* పెట్రోలియం యూనివర్సిటీ - రూ. 168 కోట్లు
* విశాఖ స్టీల్ ప్లాంట్ - రూ. 683 కోట్లు
శ్రీఅన్న పథకం కోసం హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు : చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రపంచానికి పరిచయం చేయడంలో భారత్ ముందుందని సీతారామన్ తెలిపారు. చిరుధాన్యాలను మంత్రి తన ప్రసంగంలో ‘శ్రీఅన్న’గా వ్యవహరించడం గమనార్హం. వీటి వినియోగం ద్వారా పోషకాహారం, ఆహార భద్రతతో పాటు రైతుల సంక్షేమం కూడా సాధ్యమవుతుందని ప్రధాని మోదీ గతంలో చెప్పినట్లు గుర్తుచేశారు. భారత్‌లో జొన్న, రాగి, బాజ్రా, సామలు.. సహా పలు రకాల చిరుధాన్యాలను పండిస్తున్నట్లు తెలిపారు. వీటి వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటాయని గుర్తుచేశారు. శతాబ్దాలుగా దేశ ఆహార పద్ధతుల్లో ఇవి భాగంగా ఉన్నాయన్నారు.
భారత్‌ను ప్రపంచ శ్రీఅన్న కేంద్రంగా మార్చడంలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు. తద్వారా శ్రీఅన్న సాగుకోసం మేలైన పద్ధతులు సహా ఇతర పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు.
ఇవీ చదవండి: